9714 కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.

9714 కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. 

పేదల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం నిర్ణయం.

             తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న స్లమ్ ఫ్రీ అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టీ.రామారావు అన్నారు. వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో రూ. 28.03 కోట్ల వ్యయంతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.రామారావు  ప్రారంభించారు.


                     ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీ నగర్ శాసన సభ్యులు డీ.సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఏగ్గే మల్లేశం, దయానంద్, కార్పొరేషన్ చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, జీహెచ్ఎంసీ కమీషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు  తదితరులు హాజరయ్యారు.

 

                  మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో దాదాపు 90 శతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావోస్తుందని అన్నారు. ఇప్పటికే పది వేల ఇల్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నగరంలో రూ. 9714 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల వంటివి స్వాతంత్రం సిద్దించిన 72 సంవత్సరాల చరిత్రలో దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదని పేర్కొన్నారు. నాణ్యతపరంగాను ఈ ఇళ్లకు సాటిలేవని, నిరుపేదలు కూడా ఆత్మా గౌరవంతో ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారని కే.టీ.ఆర్ చెప్పారు.  వనస్థలిపురంలో సెల్లర్, స్టిల్ట్, 9 అంతస్తులలో మూడు బ్లాకుల్లో నిర్మించిన ఈ  324 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మార్కెట్ లో దాదాపు రూ. 150 కోట్ల విలువ చేస్తుందని వెల్లడించారు. ఇక్కడి భూమి విలువ మార్కెట్ లో గజానికి రెండు లక్షల విలువ ఉందని అన్నారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసించే లబ్ధిదారులు తమ ఇళ్లలో ఏవిధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా లబ్ది దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల యాజమాన్య పట్టాలను మంత్రులు కే.టీ.ఆర్., సబితా ఇంద్రా రెడ్డి లు అందచేశారు.

 అన్ని సౌకర్యాలతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం 
మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక లీవింగ్ రూమ్, రెండు బెడ్ రూమ్ లు, ఒక కిచెన్ రూమ్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మిచిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు ఉచితంగా కేటాయించారు. ఈ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలైన త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ,  సీ.సీ.రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.