తెలంగాణలో పోటీకి సిద్ధం..
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించి, వారాహికి వాహన పూజ చేయించారు. అనంతరం స్థానికంగా తెలంగాణ నేతలతో పవన్ సమావేశమయ్యారు.
బీజేపీతోనే జనసేన దోస్తీ....
ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయం. పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తాం. 25-40 అసెంబ్లీ స్థానాల్లో, 7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. తెలంగాణలో పర్యటిస్తా. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేశాకే నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో నేను లేను. వారి పోరాటాలు చూసి నేర్చుకున్నా. యువత బలిదానాల మధ్య తెలంగాణ ఏర్పడింది. పార్టీ పరంగా రాత్రికిరాత్రే ఎదగలేం. చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.