ఏపీకి బయల్దేరిన మాజీ సీఎస్ సోమేష్‌కుమార్..

11 గంటలకు సీఎం జగన్‌తో భేటీ..   

      తెలంగాణ మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్  విజయవాడకు బయలుదేరారు. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్లారు. ఉదయం 10:15 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో భేటీ కానున్నారు. సీఎస్ కు జాయినింగ్ రిపోర్ట్ చేయనున్నారు. అనంతరం 11 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నారు సోమేష్. కాగా, ఈ ఏడాది డిసెంబర్ వరకు సోమేష్ కుమార్ పదవీకాలం ఉండగా.. మిగిలిన పదవీ కాలాన్ని ఏపీలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎస్‌గా పని చేసిన ఆయనకు, ఏపీలో ఎలాంటి పోస్ట్ ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.

    ఏపీ క్యాడర్‌కు చెందిన సీఎస్ సోమేష్ కుమార్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటూ వచ్చారు. తొలుత జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, ఆ తరువాత సీఎస్‌గా నియామకం అయ్యారు. అయితే, తాజాగా సోమేష్ కుమార్ తన ఏపీకి తక్షణమే వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైకోర్టు తీర్పు రావడమే ఆలస్యంగా.. కేంద్రం కూడా సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీకి వెళ్లాలంటూ ఆదేశించింది. దాంతో చేసేదేమీ లేక.. సోమేష్ కుమార్‌కు ఏపీకి వెళ్తున్నారు.