త్వరలో పే జల్ సర్వేక్షన్ ద్వారా తాగునీటి సర్వే
కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘’ పే జల్ సర్వేక్షన్- 2022’’ లో భాగంగా దేశ వ్యాప్తంగా అమృత్ నగరాలతో పాటు హైదరాబాద్ లో సైతం తాగునీటి సర్వే నిర్వహించనున్నారు. కేంద్ర బృందాలు చేపడుతున్న ఈ సర్వే నేపథ్యంలో జలమండలి ప్రధాన కార్యాలయంలోఎండీ దానకిశోర్ అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. జలమండలి ప్రజలకు అందిస్తున్న సేవలను ఆ సర్వే బృందానికి వివరించాలన్నారు. నీటి వినియోగ సేవలు, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగ సేవలు, నీటి వనరులు, ఆదాయం లేని నీరు (నాన్ రెవెన్యూ), ఉత్తమ అభ్యాసాలు, ఆవిష్కరణలు అనే 5 అంశాల్లో సర్వే ఉంటుందని, ఈ అంశాల్లో జలమండలి సేవలను ఆ బృందానికి వివరించి మంచి స్కోర్ సాధించేలా కృషి చేయాలని సూచించారు.
నీటి సరఫరా, నాణ్యత, పరిమాణం, కవరేజ్, మురుగు నీరు, సెప్టేజీ నిర్వహణ, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం, రీసైకిల్ పరిధి, నగరంలో నీటి వనరుల సంరక్షణ తదితర విషయాలపై ప్రత్యేక బృందం సర్వే నిర్వహించనుంది. ఈ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి శాంపిళ్ల ను సేకరించి పరీక్షించనున్నారు. ఈ సర్వేలో భాగంగా పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్, అధికారుల ద్వారా డేటా సేకరించనున్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు కనబర్చిన వారిని అవార్డుకు ఎంపిక చేస్తారు.