హ్యాట్సాఫ్ సీఐ..

  • నీడలేని పోలియో బాధితుడు, తల్లి
  • టీవీ కథనానికి చలించిన ట్రాఫిక్‌​ సీఐ నాగమల్లు
  • వారి కోసం బంగారం తాకట్టు పెట్టి ఇంటి నిర్మాణం


హైదరాబాద్‌ : అతడి పేరు చంద్రయ్య. ఊరు సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం చిల్వకుంట్ల. చిన్నప్పుడే పోలియోతో కాళ్లు చచ్చుబడిపోయాయి! తల్లి చంద్రమ్మ (90) వృద్ధాప్య సమస్యలతో మంచంపట్టింది. వారికి గుంట భూమిలేదు.. ఉండేందుకు ఇల్లూ లేదు. చంద్రయ్య పాకుతూనే ఊర్లో ఇంటింటికీ తిరిగి అన్నం బిచ్చమెత్తుకొని వచ్చి ఆమెకు పెడతాడు. మిగిలిందే తాను తింటూ బతుకుతున్నాడు. ఇదంతా టీవీలో చూసిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చలించిపోయాడు. అయితే.. వారికి ఎంతో కొంత డబ్బిచ్చి సరిపుచ్చలేదు. వారుండేందుకు రేకులతో ఓ ఇల్లు కట్టించి ఇచ్చాడు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే సీఐ నాగమల్లు ఔదార్యమిది! చంద్రయ్య, చంద్రమ్మలను ఆదుకునేందుకు నాగమల్లు వారి ఊరు వెళ్లారు. చుట్టూ పొదలు, రాళ్ల మధ్య బతుకుతున్న తల్లీకొడుకులను చూసి ఆవేదన చెందాడు. తొలుత తాత్కాలికంగా కర్రలతో పందిరిలా వేయించి ఇచ్చాడు. తర్వాత తన మెడలోని గొలుసు, ఉంగరం, కూతురు గాజులను తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. మరో రూ.65వేల దాకా అప్పు చేసి రేకులతో చక్కగా ఓ ఇల్లు కట్టించి ఇచ్చారు. అనంతరం వారికి ఇద్దరికీ కొత్తబట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించారు. సొంతవాళ్లనే పట్టించుకోని ఈ రోజుల్లో సీఐ నాగమల్లు చూపిన ఔదార్యాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.