వైసీపీలోకి జీవితారాజశేఖర్

ఓటర్లే జీవితాంతం ఒక పార్టీకి ఓటు వేయనప్పుడు రాజకీయ నేతలు ఒకే పార్టీలో ఉండాలనడం సరికాదని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు.

జగన్ సమక్షంలో జీవితా రాజశేఖర్ దంపతులు ఈ రోజు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘పార్టీలు మారినంత మాత్రాన మేం అయోగ్యులం కాదు. మమ్మల్ని పార్టీ మారుతున్నారని అందరూ విమర్శిస్తున్నారు. కానీ, మా మనసాక్షి ప్రకారమే మేం నడుచుకుంటున్నాం. ఓటర్లే జీవితాంతం ఒక పార్టీని అంటుపెట్టుకొని ఉండరు. అలాంటిది మేం పార్టీ మారితే తప్పేముంది. అలా విమర్శించడం సరికాదు’’ అని అన్నారు.

‘‘పదేళ్ల నుంచి ప్రజల మధ్యే జగన్ తిరుగుతున్నారు. ఆయన పులి బిడ్డ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పగా ఆయన పాలిస్తారని అనుకుంటున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయితే ఏపీ బంగారు లోకం అవుతుంది’’ అని చెప్పారు.
జీవిత మాట్లాడుతూ, ‘‘రాజశేఖర్ తన మనసులో ఉన్నదే చెబుతారు. అప్పట్లో మేం జగన్‌ను వ్యతిరేకించాం. జగన్ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాలేదు. 10 ఏళ్ల నుంచి జగన్‌ రాజకీయ జీవితం చూసి మళ్లీ వైసీపీలోకి వచ్చాం. పట్టుదల ఉన్న జగన్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్‌లో పదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. ఆ రోజు ఉన్న పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.’’ అని అన్నారు. జీవితా రాజశేఖర్ దంపతులతో పాటు సినీ నటి హేమ, యాంకర్ శ్యామల కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.