మరో 7 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం.......

మేడారం జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క ఆగమనం....

మేడారం జాతరలో అత్యంత ప్రధానమైనది సమ్మక్క చిలకల గుట్ట నుండి ( వనం నుండి రావడం) గద్దెలకు తెచ్చే సమయం. కొన్ని లక్షల మంది ఎదురు చూసే సమ్మక్క ఆగమన ఘట్టాన్ని కనులారా చూడడమే గానీ వర్ణించలేం. జిల్లా కలెక్టర్, ఎస్.పి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వందల కొద్ది పాత్రికేయులు ముఖ్యంగా వీడియో, ఫోటో గ్రాఫర్లు గంటల కొద్ది వేచి ఉండడం, సమ్మక్క రాకకు గుర్తుగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి కాల్పులు జరపడం, దానితో ఒక్క సారిగా కొన్ని వేల మంది శివ సత్తులు శిగాలు ఊగడం, వేలాది జంతు బలులు, దారి పొడుగునా రంగు రంగుల ముగ్గులతో అమ్మవారికి స్వగతం పలకడం, ముఖ్యంగా సమ్మక్క ప్రతిరూపంగా కుంకుమ భరణేను ఒక వెదురు బుట్టలో వడ్డెలు ( వీరినే గిరిజన పూజారులు అని అంటారు ) తీసుకు వస్తారు. సమ్మక్క ను  తీసుకువచ్చే ఈ వడ్డెలను తాకడానికి ఎంతో మంది ప్రయత్నస్తారు. కొంత మంది వీ.వీ.ఐ.పిలకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఈ అదృష్టం లభించే వారిలో పౌర సంబంధాల అధికారులు  కూడా ఉంటారు. చిలకల గుట్ట నుండి సమ్మక్క వచ్చే అంకంలో పోలీసులదే కీలక పాత్ర ఉంటుంది. లక్షలాది మంది భక్తులనుండి సమ్మక్కను సకాలంలోగా గద్దె లకు తీసుకెళ్లడం పోలీసులకు ఒక సవాలుగా ఉంటుంది. ఈ ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు  వరంగల్ పోలీసులలో ఐదారుగురు పోలీసు అధికారులు  ఉంటారు. వారు మాత్రమే సమ్మక్క ను చిలకల గట్టు నుండి , గద్దెల వరకు త్వరితంగా తీసుకురాగలిగే మెలకువతో  పనిచేస్తారు. ఈ అంకంలో కోయ గిరిజనుల  సాంప్రదాయాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా, వారి డిమాండులను గౌరవిస్తూ తొందరగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రత్యేకత గాంచిన  కొంతమంది  పోలీసు అధికారుల్లో ఇటీవల మరణించిన అడిషనల్ ఎస్.పి దక్షిణా మూర్తి ఒకరు. సమ్మక్కను చిలకల గుట్టనుంది గద్దెలవరకు తీసుకు వెళ్లడంలో ఆయన ప్రసిద్ధుడు. గిరిజన పూజారులు కూడా దక్షిణామూర్తి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కలెక్టర్, ఎస్,పి తో సహా ఎవ్వరి మాట వినని వడ్డెలు మాత్రం దక్షిణామూర్తి చెప్పినట్టు వినేవారు. పాత్రికేయులతో ఎంతో ఫ్రెండ్షిప్ చేసే దక్షిణామూర్తి చిలకల గట్టు వద్ద మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రెస్ రిపోర్టర్లు, ఫోటో, వీడియో గ్రాఫర్లను నిర్దాక్షిణ్యంగా తోసివేసేవాడు. నాలుగురోజుల పాటు జరిగే మేడారం జాతరలో రెండో రోజైన సమ్మక్క ఆగమనం అంత్యంత ప్రధానమైనది. ఈ సమ్మక్క రాక ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గద్దెలవరకు  వస్తే మొత్తం జాతర 80 శాతం విజయ వంతమైనట్టేనని అధికారులు భావిస్తారు. ఫిబ్రవరి 16 వ తేదీ నుండి 19 వరకు జరిగే మేడారం జాతరలో 17 ఫిబ్రవరి  నాడు సాయంత్రం 5 గంటలకు చిలకల గట్టు నుండి సమ్మక్క గద్దెలకు బయలు దేరుతుంది.