భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ వెయ్యి అస్థి పంజరాలు

యువ సైనికులు కొంతమంది చాలా ఓపికతో, మెల్లగా మనుషుల అస్థి పంజరాలపై దశాబ్దాల నుంచీ పేరుకుపోయిన మట్టిని శుభ్రం చేస్తున్నారు. ఆ ఎముకలతోపాటు బట్టల ముక్కలు, బూట్లు, చెప్పులు కూడా బయటపడుతున్నాయి. ఆ సైనికులు పశ్చిమ బెలారస్‌లో ఒక భవన నిర్మాణ స్థలంలో గతంలో జరిగిన మారణహోమం చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పోష్ ప్రాంతంలో ఒక అపార్టుమెంట్ బ్లాక్‌లో భవనం కట్టడానికి తవ్వకాలు జరిపినప్పుడు చాలా మందిని సామూహికంగా ఖననం చేసిన ఒక గొయ్యి బయటపడింది. అప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఆ సైనికులు ఇప్పటివరకూ యూదులకు చెందిన వెయ్యి అస్థి పంజరాలు బయటకు తీశారు. నాజీ సైన్యం జర్మనీని స్వాధీనం చేసుకున్న సమయంలో బ్రెస్ట్ నగరంలో వీరందరినీ చంపేశారు. ఆ పనిలో ఉన్న బెలారస్ సైనికుడు దమిత్రీ కెమిస్కీ "ఆ అస్థిపంజరాల పుర్రెల్లో బుల్లెట్ రంధ్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది" అన్నారు. అతడు తన టీమ్‌తో కలిసి సాధారణంగా సోవియట్ సైనికుల అస్థిపంజరాలు వెతికే పని చేస్తుంటాడు. ఇక్కడ అతడికి చిన్నారుల పుర్రెలు కూడా దొరికాయి. బిడ్డలను ఒడిలోనే పెట్టుకున్న మహిళల అస్థిపంజరాలూ కనిపించాయి.

గొయ్యి దగ్గరకు తీసుకెళ్లి కాల్చి చంపేశారు
దీని గురించి బీబీసీతో మాట్లాడిన దమిత్రీ "వారిని తల వెనుక నుంచి తుపాకీతో కాల్చి చంపారు. ఖననం చేసిన గుంతలో అన్ని శవాల ముఖాలూ కిందికి ఉన్నాయి. నాజీలు గొయ్యి తవ్వారు. తర్వాత తుపాకీతో కాల్చడంతో వాళ్లందరూ ఆ గుంతల్లో పడిపోయారు" అని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రెస్ట్ నగరం మొత్తం జనాభా 50 వేలు. వారిలో సగం మంది యూదులే. 1941 జూన్‌లో జర్మనీ దీనిని ఆక్రమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే సైనికులు నగరంలోని 5 వేల మందిని చంపేశారు. ప్రాణాలతో ఉన్నవారిని కొందరిని ఘెట్టో అనే బస్తీల్లో ఉంచేసి, వారు బయటకు రాకుండా చుట్టూ ముళ్ల కంచెలు బిగించారు. 1942 అక్టోబర్‌లో మిగిలిన వారిని కూడా చంపేయాలని ఆదేశాలు అందాయి. దాంతో సైనికులు వారిని ఒక గూడ్స్‌లో వంద కిలోమీటర్ల దూరం అడవి వైపు తీసుకెళ్లారు. బ్రోనా గోరాలో ఒక పెద్ద గొయ్యి దగ్గరకు తీసుకెళ్లి కొన్ని వేల మందిని కాల్చి చంపారు.

మారణహోమంపై సోవియట్ మౌనం
"ఆరోజు మా అమ్మానాన్న తిరిగి ఇంటికి వచ్చేసరికే సగం ఖాళీ అయిపోయుంది అని మిఖాయిల్ కాప్లాన్ చెప్పారు. జర్మనీ సైనికులు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఆయన తల్లితండ్రులు బయటకు వెళ్లున్నారు. దాంతో బతికిపోయారు. సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన తన చిన్నాన్న, పిన్నిలు, సవతి సోదరుల ఫొటోను చూస్తూ మిఖాయిల్ అప్పటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. "దీని గురించి మా అమ్మనాన్న ఒక్క మాట కూడా చెప్పలేదు. అది చాలా బాధాకరం. కానీ తన పిల్లలను తలుచుకుని మా నానమ్మ ఏడుస్తూ ఉండేవారు" అన్నారు.

 "ఆరోజు అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఎవరూ బహిరంగంగా దాని గురించి మాట్లాడరు. జర్మనీ నగరంలో అందరినీ కావాలనే కాల్చి చంపింది. సోవియట్ మాత్రం అదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. బ్రెస్ట్‌లో ఉన్న మ్యూజియం కూడా సెల్లార్‌లోని గదిలో ఉంది. దానిని యూదుల సమాజమే నిర్మించింది. దాన్ని వాళ్లే చూసుకుంటున్నారు.

ఒక్క రోజే 17,893 మంది యూదులను కాల్చివేత
నాజీ సైనికులకు భయపడి ఇళ్ల పైన, గోడల వెనక దాక్కుని అప్పుడు చాలా మంది యూదులు ప్రాణాలు కాపాడుకున్నారు. మ్యూజియంలో ఒక సిటీ రిజిస్టర్‌ కూడా ఉంది. దానిని జర్మన్లు రాసేవారు. అందులో 1942 అక్టోబర్ 15న నగరంలో 17,893 మంది యూదులు ఉన్నట్టు రాసుంది. కానీ ఆ తర్వాత రోజే ఆ సంఖ్యను కొట్టివేసుంది. యూదుల సమాజానికి చెందిన ఎఫిమ్ బేసిన్ అనే ఒక నేత "ఘెట్టోలో ఉన్న వారిని కూడా చంపేశారని మాకు ఆ రిజిస్టర్‌ను చూశాక తెలిసింది" అని చెప్పారు. భవనం కడుతున్న స్థలంలో కొన్ని మృతదేహాలు కనిపించవచ్చని ఆయనకు సందేహం వచ్చింది. కానీ అక్కడ ఇన్ని అస్థిపంజరాలు కనిపిస్తాయని ఆయన అనుకోలేదు. "చరిత్ర గురించి మనకు ఎంత తక్కువ తెలుసో, ఇలాంటి వాటితో బయటపడుతుంది" అంటారు ఎఫిమ్. ఎఫిమ్ ఎన్నో ఏళ్ల నుంచీ ఇలాంటి సమాచారం సేకరిస్తూ వచ్చారు. కానీ ఆ ఘటనలకు సాక్ష్యుల సంఖ్య మాత్రం తక్కువే.

చంపిన చోటే పూడ్చేసేవారు
సమాధులను మట్టి నుంచి తవ్వేసి అక్కడ ఒక స్టేడియం కూడా నిర్మించారు. బ్రెస్ట్‌లో ఉన్న మ్యూజియంను యూదు సమాజం నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని ఇక్కడి యూదులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దొరికిన ఎముకలను స్మశానానికి తీసుకొస్తారు. అంతకు మించి చేసేదేం ఉండదు. ఇక్కడ ఎక్కడ తవ్వినా అస్థిపంజరాలు బయటపడతాయి. జర్మన్ సైనికులు జనాలను ఎక్కడికక్కడే చంపేసేవారు, వారిని అక్కడే గోతులు తవ్వి పూడ్చేసేవారు అని వారు చెప్పారు. కానీ యూదుల పట్ల జరిగిన ఈ ఘోరాల గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుందని భావిస్తున్నారు.