నూతన వ్యవసాయ చట్టాలతో నష్టం - చుక్క రామయ్య

నూతన వ్యవసాయ చట్టాలతో తీవ్ర నష్టం - చుక్క రామయ్య
రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యవేత్త, మాజీ శాసన మండలి సభ్యులు చుక్క రామయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న ధర్నాలో అయన పాల్గొన్నారు.
చుక్క రామయ్య మాట్లాడుతూ లక్షలాది మంది చిన్న రైతుల ప్రయోజనం కోసం వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో మెరుగుదలతో కూడిన మార్పులు అవసరం అన్నారు. అయితే, కొత్త చట్టాలోన సంస్కరణలు అందుకోసం ఉపయోగపడవు అని అన్నారు. వ్యవసాయ మార్కెట్లను నియంత్రించడంలో రాష్ట్రాల పాత్రను ఈ నూతన చట్టాలు అణగదొక్కుతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల ద్వారా ఎపిఎంసి మార్కెట్ యార్డులో ఉన్న నియంత్రిత మార్కెట్‌కు అధనంగా తాజా చట్టాల ద్వారా మరో నియంత్రణ లేని మార్కెట్ ఏర్పాటౌతుందని, దీని వలన రెండు చట్టాలు అమల్లో ఉన్నట్లు అవుతుందని, వివిధ మార్కెట్ ఫీజులు, నిబంధనలు వస్తాయని అన్నారు. దీంతో వ్యాపారులు నియంత్రిత మార్కెట్ నుంచి అనియంత్రిత మార్కెట్‌కు మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎపిఎంసి మార్కెట్ యార్డుల రోజువారీ వేలం ద్వారా రైతులకు కొన్ని నమ్మకమైన ధర సంకేతాలను అందించాయి. అయితే విచ్చిన్నమైన మార్కెట్లు స్థానిక గుత్తాధిపత్యానికి మార్గం సుగమనం చేస్తాయని చుక్కా రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 2006లో బీహర్‌లోని ఎపిఎంసి చట్టాన్ని తొలగించిన అనుభవం ఇదే చెబుతుందని, రైతులకు భేరసారాలు ఆడే అవకాశం ఉండదని, ఫలితంగా ఇతర రాష్ట్రాలతో పోల్చిస్తే ధరలు గణనియంగా తగ్గుతాయని పేర్కొన్నారు.
మోడి ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చ జరపకుండా వ్యవసాయ చట్టాలను నియంతృత్వ ధోరణితో ఆమోదించుకుందన్నారు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్లు. ఈ చట్టాలు రైతుల చేతుల్లోని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని, నిత్యావసర సరుకులపై ప్రభుత్వ నియంత్రణపోయి ఆహర భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. అంబానీ, అదానీలకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలను ప్రతిఘటించాలని కోరారు. రైతాంగ ఉద్యమం జీతీయోద్యమం నాటి ఉద్యమ ఘటనలను గుర్తుకు తెస్తోందన్నారు. ఉద్యమాలకు దూరంగా వుండే భూస్వాములు కూడా ఉద్యమంలోకి రావడం, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలపడంతో మోడీ రైతుల ఉద్యమంపై దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని చెప్పారు. డిల్లీలో రైతుల చారిత్రాత్మక ఉద్యమంలో విదేశీ నిధులతో నడుస్తోందని, పంజాబ్ రైతులే పాల్గొంటున్నారని, ఖలిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్రప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ విషం చిమ్ముతున్నాయన్నారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, కార్పొరేట్లకు ఉపయోగపడే వ్యవసాయోత్పత్తుల స్వేచ్ఛా మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని అన్నారు. వ్యవసాయ పంటలకు స్వామినాథన్ కమీషన్ సిఫారసు చేసినట్లుగా ఉత్పత్తి ఖర్చులపై 50శాతం కలిపి మద్దతు ధరల గ్యారంటి చట్టం చేయాలని, రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు.