కార్మికులకు అండగా కేసిఆర్

పేద‌లు, వ‌ల‌స కార్మికుల‌కు అండ‌గా నిలిచిన‌ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ - మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ 
 

రాష్ట్రంలో 87 ల‌క్ష‌ల మంది తెల్ల రేష‌న్‌కార్డుదారుల‌కు ఉచితంగా 12 కిలోల బియ్యం, రూ. 1500 అంద‌జేసిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌, చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న 2.71 ల‌క్ష‌ల మంది వ‌ల‌స కార్మికుల ఆక‌లిని తీరుస్తున్న ప్ర‌భుత్వం 

నిర్మాణ సంస్థ‌ల ద్వారా 280 ప‌ని ప్ర‌దేశాల్లో ల‌క్ష మంది కార్మికుల‌కు భోజ‌న వ‌స‌తులు 

చ‌ర్ల‌ప‌ల్లి డివిజన్ లో వలస కూలీలకు బియ్యం, రూ.500 పంపిణీ చేసిన మేయర్ బొంతు రామ్మోహన్ 
   

                     క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉపాధిలేక ఇబ్బంది ప‌డే పేద‌లు, వ‌ల‌స కార్మికుల‌కు ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు అండ‌గా నిలిచార‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు.    చ‌ర్ల‌ప‌ల్లి డివిజన్ లో రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ఛైర్మ‌న్ మారెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్ల‌తో క‌లిసి  వలస కూలీలకు 12 కిలోల  బియ్యం, రూ.500 చొప్పున  న‌గ‌ర మేయర్ బొంతు రామ్మోహన్ పంపిణీ చేశారు. 

                ఏ ఒక్క‌రూ ఆక‌లితో ఇబ్బంది ప‌డ‌రాద‌నే సంక‌ల్పంతో పేద‌లు, వ‌ల‌స కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు మేయర్ బోంతు రామ్మోహన్. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 87 ల‌క్ష‌ల మంది తెల్ల‌రేష‌న్‌కార్డు దారుల‌కు ఉచితంగా 12 కిలోల బియ్యం, ఖ‌ర్చుల‌కు రూ. 1500 లు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. వేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రం, దాని చుట్టుప్ర‌క్క‌ల జిల్లాల‌లో దాదాపు ప‌ది రాష్ట్రాల‌కు చెందిన కార్మికులు ఉన్నార‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప‌నులు నిలిచిపోయినందున 280 ప‌ని ప్ర‌దేశాల్లోనే భోజ‌న వ‌స‌తులు, ఆరోగ్య సంర‌క్ష‌ణ చూడాల్సిన బాధ్య‌త ఆయా నిర‌మాణ సంస్థ‌ల‌పై ఉన్న‌ద‌ని నిర్దేశిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు తెలిపారు. ఈ ఉత్త‌ర్వుల అమ‌లుకు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క రామారావు చొర‌వ తీసుకొని సంబంధిత నిర్మాణ సంస్థ‌ల‌తో రెండు విడ‌త‌లు చ‌ర్చించి, ఒప్పించిన‌ట్లు వివ‌రించారు. అదేవిధంగా హైద‌రాబాద్ న‌గ‌రం, దాని చుట్టుప‌క్క‌ల హె.ఎం.డి.ఏ ప‌రిధిలో అసంఘ‌టిత రంగంలో ఉపాధి పొందుతున్న 2 ల‌క్ష‌ల 71వేల 742 మంది వ‌ల‌స కార్మికుల‌ను గుర్తించి, వారి ఆక‌లిని తీర్చేందుకు రెండు విడుత‌ల‌లో 3260 మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా వారి ఖ‌ర్చుల నిమిత్తం ఒక్కొక్క‌రికి రూ. 500 ల చొప్పున రూ. 13 కోట్ల 58 ల‌క్ష‌ల 71వేల న‌గ‌దును అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌రాద‌నే ఉధ్యేశంతో రెండు నెల‌ల‌కు స‌రిప‌డ బియ్యాన్ని ఉచితంగా ప్ర‌భుత్వం ఇస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే అనేక మంది పెద్ద‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు పేద‌ల‌కు అన్న‌దానం చేసేందుకు, నిత్యావ‌స‌రాల‌ పంపిణీకి ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ, సామాజిక దూరాన్ని అమ‌లు చేయాల‌నే ఉద్దేశంతో నోడ‌ల్ అధికారులను నియ‌మించిన‌ట్లు తెలిపారు. అన్న‌దానం, నిత్య‌వ‌స‌రాలు ఇవ్వాల‌నుకునే దాత‌లు జిహెచ్‌ఎంసి నోడ‌ల్ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. జిహెచ్‌ఎంసి ద్వారానే నిత్య‌వ‌స‌రాల పంపిణీ నిర్వ‌హించాల‌ని సూచించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టుట‌లో సామాజిక దూరాన్ని పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.