ఐదురోజుల పాటు కారుచిక‌టిలో


# ఐదురోజుల పాటు కారుచిక‌టిలో బాలిక‌.
# రేకులు విరిగి బాత్ రూంలో ప‌డిపోని చిన్నారి.
# ఊరంత వేతికిన త‌ల్లిదండ్రులు.
# తాలం వేసిన‌ ప‌క్కింటి వారి  బాత్ రూంలో ఐదురోజులు.


     నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లయినా తాగి బతకాలి’.. అన్నాడొక సినీ కవి. నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో చీకటి గదిలో చిక్కుకున్న ఓ ఏడేళ్ల బాలిక ఇలాగే ఐదురోజులపాటు నీళ్లు తాగి బతికింది. గత శనివారం పొరుగింటి డాబా ఎక్కి అడుకుంటుండగా ఆ ఇంటి స్నానాలగదిపై ఉన్న ఓ ప్లాస్టిక్‌ రేకుపై కాలు పెట్టి అది విరిగిపోవడంతో ప్రమాదవశాత్తు లోపలికి పడిపోయింది. ఆ ఇంట్లో ఎవరూ లేరు. గట్టిగా శబ్దంచేసినా.. కేకలు వేసినా.. బిగ్గరగా ఏడ్చినా కూడా చుట్టుపక్కల ఎవరికీ వినిపించలేదు. ఏడ్చిఏడ్చి బెంగతో అలాగే పడి ఉంది. ఆహారం లేకపోయినా అక్కడ ప్లాస్టిక్‌ బిందెల్లº మిగిలి ఉన్న కొద్దిపాటి నీరు తాగి ప్రాణాలు కాపాడుకున్న ఆ చిన్నారి బుధవారం గది తలుపు తీయగానే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బయటికి వచ్చింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మక్తల్‌కు చెందిన కుర్వ సురేష్‌, మహదేవమ్మల చిన్నకుమార్తె అఖిల. ఈమె ఈనెల 20వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో చాక్లెట్‌ తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి రాలేదు. యాదవనగర్‌లో బీరప్ప జాతర జరుగుతున్నందున అక్కడ తప్పిపోయి ఉంటుందని భావించిన తల్లిదండ్రులు ఆ ప్రాంతమంతా గాలించారు. తరువాత మైకులో ప్రకటన చేయించినా ఆమె ఆచూకీ తెలియలేదు. అదేరోజు సాయంత్రం మక్తల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడిపై భారం వేసి అఖిల కోసం ఎదురుచూడసాగారు.

                                                                 పక్కింట్లో ఎవ్వరూ లేకపోవడంతో..

          సురేష్‌ పొరుగింట్లో ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు.. ఆయన భార్యాబిడ్డలు హైదరాబాదులో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో ఉపాధ్యాయుడు కూడా ఇంటికి తాళం వేసి హైదరాబాదుకు వెళ్లారు. బంధువుల పెళ్లి ఉండటంతో అక్కడి నుంచి బుధవారం రాత్రి మక్తల్‌కు తిరిగి వచ్చారు. ఇంటిలోకి వెళ్లాక స్నానాల గది తెరిచి చూస్తే దీనస్థితిలో పడున్న అఖిల కనిపించింది. శ్రీనివాస్‌రావును చూడగానే బాలిక పైకి లేచి నడుస్తూ బయటికి వచ్చింది. పొరుగునున్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలియగానే పరుగున వచ్చి అఖిలను గుండెలకు హత్తుకున్నారు. స్థానిక వైద్యులు అఖిలను పరీక్షించారు. నీరసంగా ఉండటంతో సెలైన్‌ పెట్టి చికిత్స అందించారు.  చిక‌టి గ‌దిలో ఐదురోజుల పాటు గ‌డ‌పటంతో కోంత ఇబ్బందిక‌రంగా ఉంది అఖిల‌.