ఈ నియోజకవర్గంలో పవన్ పరిస్ధితేంటి ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి పడింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో కూడా పవన్ పోటీ చేస్తున్నారు. నిజానికి పార్టీ అధినేత హోదాలో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది.
ఒక నియోజకవర్గంలో గెలుపుపై నమ్మకం లేకే రెండు చోట్ల పోటీ చేస్తున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు తగ్గట్లే క్షేత్రస్ధాయిలో పరిస్ధితిలు కూడా ఉన్నట్లు సమాచారం. రెండింటిలోను పవన్ గెలిస్తే ఏ నియోజకవర్గాన్ని ఉంచుకుంటారు అనే విషయమై పెద్ద చర్చ జరుగుతోంది. చర్చలు ఏ విధంగా జరిగినా సారంసం మాత్రం గాజువాకనే ఉంచుకుంటారని ఎవరికి వారుగా ఫైనల్ అయిపోయారు.


అందుకనే భీమవరంలో పవన్ పరిస్ధితి ఎలాగుందనే విషయంలో చర్చలు కూడా ఊపందుకున్నది. విషయంపై ఆరా తీస్తే ఇక్కడ గెలుపు అవకాశాలు పెద్దగా లేవని తెలుస్తోంది. జనాభా రీత్యా భీమవరంలో కాపులు, బిసిలదే మెజారిటీ అయినా రాజకీయాధిపత్యం మాత్రం రాజులదే. నియోజకవర్గంలో రాజుల ఓట్లు 22 వేల వరకూ ఉంటుంది. వారంతా పవన్ ను ఓడించాలని గట్టిగా కంకణం కట్టుకున్నారట. 
పవన్ ను ఓడించేందుకు రాజులు ఎందుకు నిర్ణయించుకున్నారు ? ఎందుకంటే మొదటిది చంద్రబాబునాయుడుకు పార్టరన్ అవ్వటం. ఇక రెండో కారణం ప్రభాస్ అభిమాన సంఘాలతో పవన్ అభిమాన సంఘాలకు పెద్ద గొడవలు జరగటం. పవన్ భీమవరంలో గెలిచేందుకు లేదని ప్రభాస్ కూడా అంతర్లీనంగా తన అభిమానులకు, సామాజిక వర్గాల్లోని పెద్దలకు గట్టిగా చెప్పారట. దాంతో అందరూ కాలికి బలపం కట్టుకుని వ్యతిరేకం చేస్తున్నారు. 
పవన్ తో పాటు టిడిపి తరపున పులవర్తి రామాంజనేయులు, వైసిపి తరపున గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ కాపులే కాబట్టి 60 వేల కాపుల ఓట్లలో చీలక తథ్యం. ఇక మిగిలిన 60 వేల బిసిల ఓట్లు, వైశ్యులు, బ్రాహ్మణులు, ముస్లింలు సుమారు 30 వేలుంటారు. ఎస్సీల ఓట్లు కూడా 30 వేలుంటాయి. కాపుల ఓట్లలో మెజారిటీ పవన్ కు పడినా ఇతర సామాజికవర్గాల ఓట్లు ఎక్కువ పడే అవకాశాలు లేవని సమాచారం.
నరసాపురం ఎంపిగా వైసిపి తరపున రఘురామ కృష్ణంరాజు, జనసేన ఎంపిగా పవన్ సోదరుడు నాగుబాబు పోటీ చేస్తున్నారు. ఆర్ధిక, అంగ బలంలో కృష్ణంరాజుకు నాగుబాబు ఎందులోను పోటీ ఇవ్వలేరు. మొదటిసారి పోటీ చేసే అవకాశం దక్కించుకున్న కృష్ణంరాజు తాను గెలవటంతో పాటు పార్లమెంటు పరిధిలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లోను వైసిపి అభ్యర్ధులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. నరసాపురం లోక్ సభ పరిధిలోకే భీమవరం అసెంబ్లీ కూడా రావటం పవన్ కు పెద్ద మైనస్ అయ్యిందంటున్నారు స్ధానికులు. కాబట్టి ఇటు భీమవరం అసెంబ్లీ అటు నరసాపురం పార్లమెంటులో సోదరులకు భంగపాటు తప్పదనే అర్ధమవుతోంది.