ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే పట్టాలు రద్దు-కేటీఆర్

  10.90 కోట్ల 126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.....

          హైదరాబాద్ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే  ఆ ఇళ్లా పట్టాలను రద్దు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టీ. రామారావు హెచ్చరించారు. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 28.38 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 10.90 కోట్ల వ్యయంతో బాగ్ లింగంపల్లి లంబాడి తండాలో నిర్మించిన 126 రెండు పడకగదుల ఇళ్లను, రూ. 3.50 కోట్ల వ్యయంతో అడిక్ మెట్ లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

          వీటితో పాటు రూ. 9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన జోనల్ మరియు డిప్యూటి కమిషనర్ల కార్యాలయాలకు శంకుస్థాపన, నారాయణగూడ క్రాస్ రోడ్స్ లో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ముషీరాబాద్ శాశన సభ్యులు ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.