అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదు  - మేయర్   

     అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదు  - మేయర్                

 

                    అంగవైకల్యం మనిషి ప్రతిభకు ఏ మాత్రం అడ్డుకాదని... మనస్సు ఉంటే మార్గం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే విక‌లాంగుల‌కు సాధ్యంకానిది ఏదిలేద‌ని, ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌త‌స్థానాల‌ను అధిరోహిస్తున్నార‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ పేర్కొన్నారు. వికలాంగుల మానసిక వికాసానికై రెండు కోట్ల వ్య‌యంతో మ‌ల‌క్‌పేట్‌లో థీమ్ పార్కును ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా అన్ని జోన్ల‌లో థీమ్ పార్కుల ఏర్పాటు ఆలోచ‌న ఉన్న‌ట్లు తెలిపారు.

 

                          ప్రపంచ వికలాంగుల దినోత్సవం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా జరిగింది. వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ మాట్లాడుతూ అంగ‌వైక‌ల్యం వ్య‌క్తి కోరుకున్న‌ది కాద‌ని తెలిపారు. విక‌లాంగుల‌ను విస్మ‌రించిన వ్య‌క్తి అస‌లైన విక‌లాంగుడ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని స‌రూర్‌న‌గ‌ర్‌లో ఉన్న ఒక వ్య‌క్తి పూర్తి అంధుడైన‌ప్ప‌టికీ ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగంచేస్తూ 40 మంది విక‌లాంగుల‌కు వ‌స‌తి, విద్యాస‌దుపాయాల‌ను క‌ల్పించి, ఉద్యోగాలు పొందేందుకు స‌హ‌క‌రిస్తూ, పెళ్లిళ్లు కూడా చేయిస్తున్న‌ట్లు తెలిపారు. త‌న భార్య శోభ కూడా భ‌ర్త‌కు అండ‌గా నిలుస్తున్న‌ట్లు తెలిపారు. త‌న నెల జీతాన్ని పూర్తిగా విక‌లాంగుల సంక్షేమానికై ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. బాల‌బాలిక‌ల‌కు విడివిడిగా వ‌స‌తి క‌ల్పించిన‌ట్లు తెలిపారు. ఇటువంటి వ్య‌క్తుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌ని సూచించారు. డిసెంబ‌ర్ 14న అత‌ని జ‌న్మదిన వేడుక‌ల్లో గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తాను హాజ‌ర‌వుతున్న‌ట్లు స్పీక‌ర్ తెలిపారు. విక‌లాంగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపై ఉంద‌ని తెలిపారు. విక‌లాంగుల‌కు బ్యాట‌రీ ట్రై సైకిళ్ల‌ను ప్ర‌భుత్వం అందిస్తున్న‌ట్లు తెలిపారు. బ్యాట‌రీ ట్రై సైకిళ్లకు ప్ర‌భుత్వం రూ. 25వేల‌ను రాయితీగా అందిస్తున్న‌ద‌ని, స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ వంతుగా రూ. 12వేల‌ను భ‌రించాల‌ని తెలిపారు. ఒక దివ్యాంగుడు బొప్పాయి పంట వేసి ఆద‌ర్శ రైతుగా నిలుస్తున్నాడు. ఆయ‌న‌ను ఆద‌ర్శంగా తీసుకొని దివ్యాంగులు వాణిజ్య పంట‌లు చేస్తే ప్ర‌భుత్వం నుండి స‌హాయం పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. వికలాంగుల చైత‌న్యంపై ఐదు వందల మీటర్ల నడకను స్పీకర్ జెండా ఊపీ ప్రారంభించారు.  

                           విక‌లాంగులకు మానసిక ధైర్యం ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగుల సంక్షేమానికి పెద్ద పీఠ‌ వేశారని విక‌లాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా... దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు వేల 16 రూపాయాల విక‌లాంగుల‌ పెన్షన్  ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. విక‌లాంగుల సంక్షేమానికి రూపొందించిన 15 జివోల అమ‌లుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. విక‌లాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి అవార్డులు సాధించిన‌ట్లు తెలిపారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హకారంతో విక‌లాంగుల‌కు మాన‌సిక స్థైర్యాన్ని అందించుట‌కు గ‌త వారం రోజులుగా విభిన్న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విక‌లాంగుల సంక్షేమానికి కృషిచేస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని తెలిపారు.

                             ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయర్ బాబా ఫ‌సియుద్దీన్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స‌తీమ‌ణి కావ్య‌కిష‌న్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సిక్తాప‌ట్నాయ‌క్, అర్బ‌న్ క‌మ్యునిటి డెవ‌ల‌ప్ మెంట్ విభాగం అధికారి తిరుప‌త‌య్య‌, అవేర్నెస్ వాక్ కో-ఆర్డినేట‌ర్ కొల్లి నాగేశ్వ‌ర‌రావు, విక‌లాంగుల హ‌క్కుల ఫోరం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జె.ప‌రుశురాం, నోబెల్ ఎడ్యుకేష‌న్ సొసైటి ఫౌండ‌ర్ డి.సురేష్ కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.