ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?

   వేసవి కాలంలో సాధారణంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండలవల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. మరి అలాంటి పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రతలు పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దామా..?

  • ప్ర‌తి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది.
  • రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల కూడా శరీరం చల్లబడుతుంది.
  • రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
  • అంతేగాక క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడంవల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
  • కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
  • సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తాగడంవల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది.
  • వేడిచేసే ఆహార పదార్థాలైన పుల్లటి పండ్లు, బీట్‌రూట్‌లు, క్యారెట్‌లను వేసవిలో ఎక్కువగా తినకూడదు.
  • దానిమ్మ గింజ‌ల్లో శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉంది. రెండుమూడు రోజులకు ఒకసారైనా దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ రసం తాగడంవల్ల శరీరం చల్లగా ఉంటుంది.
  • మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు.