హత్యపై సిబిఐ విచారణ జరిపించాలి

 

 మా చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి.

35ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంట్లోకి చొరబడి అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపడమనేది దారుణమైన విషయం అన్నారు వైఎస్‌ జగన్‌.  ఈ ఘటన అత్యంత దారుణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో  మీడియాతో మాట్లాడిన జగన్ ఇది రాజకీయంగా అత్యంత నీచమైన చర్య గా పేర్కొన్నారు. వివేకానందరెడ్డి అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదు. దర్యాప్తు తీరు బాధాకరం. వివేకానందరెడ్డి చనిపోతూ ఒక లెటర్‌ రాశారని.. అందులో డ్రైవర్‌ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యలో చాలా మంది ఉన్నారు. బెడ్‌రూంలో ఐదుసార్లు దాడి చేశారు. తలపైనే ఐదుసార్లు గొడ్డలితో నరికారు. రక్తం కక్కుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. చిన్నాన్న రాసినట్లుగా చూపిస్తున్న లెటర్‌ కూడా కల్పితమే. వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదు. ఎస్పీతో నేను మాట్లాడుతున్నప్పుడే..ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ నుంచి ఎస్పీకి ఫోన్లు వస్తున్నాయని జగన్‌ ఆరోపించారు. నాన్నను కట్టడి చేయడం కోసం తాతను చంపారు. తాతాను చంపిన సమయంలో సీఎం చంద్రబాబే. వైఎస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి రెండురోజుల ముందు.. అసెంబ్లీకి ఎలా వస్తావని చంద్రబాబు సవాల్‌ చేశారు. ఆ తర్వాత నన్ను ఎయిర్‌పోర్టులో చంపాలని చూశారు. నాపై హత్యాయత్నం జరిగినప్పుడు కూడా చంద్రబాబే సీఎం. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర ఉంది. సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సంయమనం పాటించండి. దేవుడున్నాడు.. దోషులను తప్పనిసరిగా శిక్షిస్తాడని జగన్‌ పేర్కొన్నారు.