యాదాద్రిలో సీవ‌రేజి వ్య‌వ‌స్థ ఎర్పాటులో జలమండలి.

ఎన్‌సీపీఈ సంస్థ‌కు డీపీఆర్ రూప‌క‌ల్ప‌న బాధ్య‌త‌లు

నెల రోజుల్లో డీపీఆర్ ఇవ్వాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ ఆదేశం

              తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా, అంత‌ర్జాతీయ అధ్యాత్మిక దివ్య‌క్షేత్రంగా యాదాద్రి శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవాలయాన్ని పున‌ర్న్మించ‌డానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి విధిత‌మే. ఈ నేప‌థ్యంలోనే యాదాద్రి టెంపుల్, యాద‌గిరిగుట్ట మున్సిపాలిటీ ప‌రిస‌రాల్లో స‌మ‌గ్ర‌ అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వ‌ర‌ద నీటి కాలువ(స్ట్రామ్ వాట‌ర్ డ్రైనేజి) వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణకు రూప‌క‌ల్ప‌న చేసే బాధ్య‌త‌ల‌ను జ‌ల‌మండ‌లికి ప్ర‌భుత్వం అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. జ‌ల‌మండ‌లి ఇప్ప‌టికే ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం ఓఆర్ఆర్ ప్రాజెక్టును, సీవ‌రేజి మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొందించి మురుగునీటి వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటోంది.ఈ అనుభ‌వం క‌లిగిన సంస్థ‌గా జ‌ల‌మండ‌లి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, యాదాద్రి టెంపుల్ ప‌రిస‌రాల్లో స‌మ‌గ్ర డ్రేనేజి వ్య‌వ‌స్థ ఏర్పాటుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

నెల రోజుల్లో డీపీఆర్ రూపొందించాలి:

ఈ మేర‌కు డీపీఆర్‌ రూప‌క‌ల్ప‌న‌కు ఇటీవ‌లే జ‌ల‌మండ‌లి నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా.. ఎన్‌సీపీఈ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థ టెండ‌ర్‌ను ద‌క్కించుకుంది. ఈ సంస్థకు ఇప్ప‌టికే ఉజ్జ‌యినీ టెంపుల్ సిటీలో రూ.400 కోట్లతో చేప‌ట్టిన‌ మంచినీరు, సీవ‌రేజి మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొందించిన అనుభ‌వం ఉంది. ఈ రోజు జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌.. ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఎన్‌సీపీఈ సంస్థ‌ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మయ్యారు. యాదాద్రి టెంపుల్‌, యాద‌గిరిగుట్ట మున్సిపాలిటీ ప‌రిధిలోని మొత్తం 12 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లకు సంబంధించి సీవ‌రేజి, స్ట్రామ్ వాట‌ర్ వ్య‌వ‌స్థ‌, ఎస్‌టీపీల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ల‌తో స‌హా డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను పూర్తి చేసి నెల రోజుల్లో అందించాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌ ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఈడీ డా.స‌త్య‌నారాయ‌ణ‌, ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ బాబు లతో పాటు ఎన్‌సీపీఈ సంస్థ‌ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.