మోదీ చౌకదారు కాదు చోరీదార్...

  • పవన్ కల్యాణ్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి : మాయావతి
     

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చౌకదారు కాదు చోరీదార్ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని విమర్శించారు.

బహుజన జనసేన యుద్ధభేరి పేరుతో విజయవాడలో జనసేన బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మాయావతి మాట్లాడుతూ, ''ఏపీని బీజేపీ కూడా మోసం చేసిందని విమర్శించారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్‌ పార్టీ వల్ల కూడా ఆశించిన అభివృద్ధి జరగలేదని" అన్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాయావతి జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేయిస్తోందని విమర్శించారు. చప్పట్లు కొడితే రాజ్యాధికారం రాదని ఊరురా తిరిగి తమ కూటమికి ఓటు వేయాలని ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. దేశంలో, రాష్ట్రంలో మార్పుకావాలంటే తమ కూటమినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలను ఆదరించిన చరిత్ర బీఎస్పీకి ఉందని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో బీఎస్పీ పార్టీ తీరును పరిశీలించానని చెప్పారు. భావజాలం బలంగా ఉంటే ప్రజలే ఆదరిస్తారని అన్నారు. మాయావతిని మాతృమూర్తిగా చూస్తానని చెప్పారు. 

దీనికంటే ముందు విశాఖపట్నంలో ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని,, పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అవుతారని అన్నారు. పవన్ యువకుడని, అర్హతలున్న నాయకుడని, సినిమాల్లో విజయవంతం అయ్యాడని, రాజకీయాల్లో కూడా విజయవంతం అవుతాడని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఇవ్వలేదని, దీంతో ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. తమ కూటమికి అధికారం లభిస్తే పవన్ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ప్రజలంతా ఇప్పుడు మౌనంగా వేచి చూస్తున్నారని, వారు తమ కూటమికే అధికారం కట్టబెడతారని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ కూటమికే ఓట్లు వేస్తారన్నారు.
‘పవన్ కల్యాణ్‌కు, తమ కూటమికి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలందరి సుఖ సంతోషాలకోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని ప్రజలకు మాయావతి విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందుకు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటారని అప్పుడు కేసీఆర్ వాగ్దానం చేశారు. కానీ, ఎందుకు ఆయన మాట నిలబెట్టుకోలేదో తెలియదు. అనుకున్నది ఆయన చేయలేకపోయారు. ఇప్పుడు మేం మాయావతి ప్రధానమంత్రి కావాలని మేం కోరుకుంటున్నాం. ఆమె అనుభవం ఈ దేశానికి కావాలి, ఈ దేశానికి ఆమె మార్గనిర్దేశనం చేయాలి. ఎంతో మంది దళిత ఉద్యమ నాయకులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్, బీజేపీ తర్వాత పెద్ద పార్టీ బీఎస్పీనే’’ అన్నారు. తప్పులు చేస్తే సొంత ఎమ్మెల్యేలను కూడా మాయావతి సహించలేదని, ఏపీలో ముఖ్యమంత్రులు మాత్రం తమ ఎమ్మెల్యేలు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోవట్లేదన్నారు.రెండు నియోజకవర్గాల్లో పోటీ వల్ల ఎన్నికల వ్యయం దుర్వినియోగం కావటం కాదా? అని ప్రశ్నించగా.. పుష్కరాల సమయంలో చంద్రబాబు, స్కాముల రూపంలో జగన్ చేసిన దుర్వినియోగంతో పోలిస్తే మార్పుకోసం తాము చేస్తున్న ప్రయత్నం వల్ల జరిగేది దుర్వినియోగం కాదని పవన్ అన్నారు.

‘వాళ్లది సంకీర్ణ అనివార్యత’
పవన్ జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మాయావతి కోరుకోవడం, మాయావతి ప్రధాని కావాలని పవన్ అనడం కొయలిషన్ కంపల్షన్ (సంకీర్ణ అనివార్యత) అని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు జింకా నాగారాజు అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మాయావతి మొదటిసారి 1995 లో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి ఇప్పటి దాకా ఆమె ఆంధ్రలో కాలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వీలుకావడం లేదు. ఇపుడామె జనసేన సహాయంతో మరొక ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కు దళిత, బహుజన ఓట్లు కావాలి.ఆందుకే ఆయన మాయావతితో పొత్తుపెట్టుకున్నారు. ఈ ఓట్ల కోసమే గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఫూలే, అంబేద్కర్ మదర్ థెరిస్సా ఫొటోలు పెట్టకున్నారు. ఎన్నికలయిపోయాక ఆయన వీళ్ల పేర్లెత్తడం మానేశారు. అపుడు చిరంజీవిగాని, ఇపుడు పవన్ గాని ప్రత్నామ్నాయ పార్టీలు కాదు. వాటికి ప్రత్నామ్నాయ రాజకీయాలు లేవు. అందుకే ఈ పార్టీలకు కొన్ని సీట్లు రావచ్చు. ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే పవర్ లోకి కూడా రావచ్చు.’’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశలో మూడో పార్టీకి అవకాశం కనిపించడం లేదని, ఇక్కడ ఉన్న రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు అందుబాటులో ఉన్న ప్రాంతానంతా అక్రమించుకున్నాయని ఆయన చెప్పారు.

‘‘ఈ రెండు పార్టీలను పడగొట్టే రాజకీయాలు జనసేనకు లేవని ఆ పార్టీ నడుస్తున్న తీరునుబట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఇక్కడ చోటు దొరకదు.జనసేన-బహుజన్ సమాజ్ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది. రాజకీయాల్లో మార్పు రాకపోయినా కొత్త దనం వస్తుంది. అయితే, పరిస్థితి అలా కనిపించడం లేదు. మహా అయితే, మరొక పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ కూటమి ఉపయోగపడవచ్చు’’ అని జింకా నాగరాజు విశ్లేషించారు.