మానవ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి ఎందుకు పోటీ చేశారు?

గణిత మేధావి రామానుజన్ తర్వాత భారత్ నుంచి ఆ స్థాయిలో పేరుతెచ్చుకున్న వ్యక్తి శకుంతలాదేవి. గణితంలో ఉన్న అసాధారణ ప్రజ్ఞ కారణంగా శకుంతలా దేవిని మానవ కంప్యూటర్‌గా పిలుస్తుంటారు. చిన్న వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌, అన్నామలై వర్సిటీలో గణితంలోని తన ప్రతిభను ఆవిష్కరించారు. 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ఓ సరికొత్త రికార్డు సృష్టించారు. గణితంపై అనేక పుస్తకాలూ రాశారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. బహుఖ ప్రజ్ఞతో తనకంటూ గుర్తుంపు తెచ్చుకున్న ఈ మానవ కంప్యూటర్‌కు తెలంగాణతో సంబంధం ఉంది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆమె ఇక్కడి నుంచే పోటీ చేశారు.

మెదక్ నుంచి ఇందిర గాంధీ పోటీ

ఆరవ లోక్‌సభ (1977-1980) ఎన్నికల్లో రాయబరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర, జనతా కూటమి అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. భారత దేశ ఉక్కు మహిళగా పేరుతెచ్చుకున్న ఇందిరాగాంధీ ప్రధానిగా ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, అత్యయికస్థితి విధించిన అనంతరం ఆమె ప్రతిష్ఠ దెబ్బతిన్నది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇందిర కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తొలిసారి జనతా పార్టీ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఎంతో కాలం కొనసాగలేదు. 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాయ్‌బరేలీతో పాటు మరో సురక్షిత ప్రాంతం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం ఇందిరకు సూచించింది. ఉత్తరాదిన జనతా పార్టీ ప్రభావం బాగా కనిపిస్తుండటంతో దక్షిణాదిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఇందిరతో పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఇతర ముఖ్య నేతలు మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరకు సూచించారు. వారి సూచనను అంగీకరించిన ఇందిర మెదక్ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నారు.

ఇందిర ప్రచారం కోసం మంత్రి పదవికి బాగారెడ్డి రాజీనామా

మెదక్ లోక్‌సభ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన ఇందిర ప్రచారంలో మాత్రం పాల్గొనలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను ఇందిరకు నమ్మకస్తుడిగా పేరున్న బాగారెడ్డికి అప్పగించింది.

''మెదక్‌తో నాన్నకు మంచి పరిచయాలున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇందిర తరఫున ప్రచారం చేయడం కోసం మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నైతికంగా సరికాదని ఆ పనిచేశారు. ఇందిర తరఫున నియోజకవర్గ ప్రచారం ఆయనే చూసుకున్నారు'' అని బాగా రెడ్డి తనయుడు మోగిలిగుండ్ల జైపాల్ రెడ్డి నాటి సంఘటనలను బీబీసీతో పంచుకున్నారు.

ఇందిరపై పోటీకి శకుంతలా దేవి

ఇందిరా గాంధీ తన పాలన కాలంలో ఎమర్జెన్సీ విధంచడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇందిర సైతం ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారిలో శకుంతలా దేవి ఒకరు.

''ఇందిర గాంధీ మెదక్ ప్రజలను పిచ్చివాళ్లను చేయకుండా రక్షించుకోవాలి. అందుకే నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను'' అని ఎన్నికల సందర్భంలో శకుంతలా దేవి చెప్పారు. 1980 ఎన్నికల్లో బొంబాయి సౌత్ తో పాటు మెదక్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. మరో వైపు ఎస్.జైపాల్ రెడ్డి జనతా పార్టీ తరఫున ఇందిరకు పోటీగా నిలబడ్డారు. పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్ తదితరులు కూడా ఇందిరపై పోటీకి దిగారు. మొత్తంగా 10 మంది అభ్యర్థులు మెదక్ ఎన్నికల బరిలో నిలిచారు.

ఇందిరకు బ్రహ్మరథం... డిపాజిట్ కోల్పోయిన శకుంతలా దేవి

ఎమర్జెన్సీ వ్యతిరేక భావన మెదక్‌ ఓటర్లలో ఏ మాత్రం కనిపించలేదు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇందిరకు పట్టంకట్టారు. ఏకంగా 2 లక్షల పైచిలుకు మెజార్టీని కట్టబెట్టారు. ఇందిరకు ఈ ఎన్నికల్లో 3,01,577 ఓట్లు రాగా, జైపాల్ రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. కేశవ్‌రావుజాదవ్‌కు 26,149 ఓట్లు పడ్డాయి. స్వతంత్రంగా పోటీ చేసిన శకుంతలాదేవి 6,514 ఓట్లతో డిపాజిట్ కోల్పోయి 9వ స్థానంలో నిలిచారు. బొంబాయి సౌత్‌లోనూ ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మళ్లీ ఎప్పుడూ పోటీ చేయలేదు. 2013 ఏప్రిల్‌లో బెంగళూరులోని తన నివాసంలో శకుంతలా దేవి తుదిశ్వాస విడిచారు.