భారత్‌పై 4లక్షలకు పైగా సైబర్‌దాడులు

న్యూదిల్లీ: కత్తులు, కర్రలతో యుద్ధాలు ఎప్పుడో ముగిశాయి.. తుపాకులు, ఫిరంగులతో యుద్ధాలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా టెక్నాలజీతో యుద్ధమే. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో భారత దేశంపై 4.36లక్షల సైబర్‌దాడులు జరిగినట్లు సైబర్‌ సెక్యురిటీ సంస్థ ఎఫ్‌-సెక్యూర్‌ వెల్లడించింది. అమెరికా, చైనా, నెదర్లాండ్స్‌ దేశాల నుంచే ఎక్కువ మంది సైబర్‌నేరగాళ్లు భారత్‌పై దాడి చేశారట. ఇంకో విశేషమేటంటే ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, యూకే, జపాన్‌, ఉక్రెయిన్‌ దేశాలపై దాడి చేసిన వారు భారత్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఎఫ్‌-సెక్యూర్‌ ఈ గణాంకాలన్నింటినీ ‘హనీపాట్స్‌’ నుంచి సేకరించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 41 హనీపాట్స్‌ ఉన్నాయి. ఇవి సైబర్‌నేరగాళ్ల చర్యలను పసిగడుతూ వారు విడుదల చేసే మాల్వేర్‌ శాంపిళ్లను, స్క్రిప్ట్‌లను, హ్యాకింగ్‌ టెక్నిక్‌లను సేకరించి విశ్లేషిస్తుంది. రష్యా (2,55,589)నుంచి అత్యధికమంది సైబర్‌ నేరగాళ్లు భారత్‌పై దాడి చేస్తున్నారు. ఆ తర్వాత అమెరికా(1,03,458), చైనా(42,544), నెదర్లాండ్స్‌(19,169), జర్మనీ(15,330) దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 6,95,396 సైబర్‌దాడులతో భారత్‌ 21వ స్థానంలో ఉంది. ఇక అమెరికా లక్ష్యంగా 1,10,10,212 దాడులు జరగ్గా, యూకేపై 97,680,746 సైబర్‌దాడులు చోటు చేసుకున్నాయి.