బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ గా తయారైన ఎన్నికల కమిషన్

  • ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి పోరాటం: చంద్రబాబు

న్యూఢిల్లీ: ఏపీ సహా 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై పోరాటం ఆరంభించారు. దేశంలోని 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో కలిసి ఆయన ఉద్యమాన్ని చేపట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్, ఈవీఎంల పనితీరును తప్పు పడుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయబోతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ గా మారిందని ధ్వజమెత్తారు. ఈవీఎంలను ఎలా బోల్తా కొట్టించవచ్చో.. తమ పార్టీ నాయకులు హరిప్రసాద్ చౌదరి ఇదివరకే నిరూపించారని చంద్రబాబు అన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈవీఎంల విధానాన్ని రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని అన్నారు.

ఈవీఎంల పనితీరుపై న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఆయన ఆదివారం ఉదయం జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో నియోజకవర్గం పరిధిలో కేవలం అయిదు ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో. చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు వారితో చర్చించారు. అనంతరం అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఆ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌ తదితరులతో కలిసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.


50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందే..

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సిబ్బంది 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అయిదు ఈవీఎంల నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తే, లెక్క తేలదని ఆయన అన్నారు. దీనివల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని చెప్పారు. జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్‌ పద్ధతిని వినియోగిస్తున్నాయని, నెదర్లాండ్ కూడా బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించిందని అన్నారు. ఏపీలో ఎన్నికలు ముగిశాయని, అయినప్పటికీ తాను రాజకీయాలకు అతీతంగా ఈవీఎంల పనితీరుపై పోరాడుతున్నానని చెప్పారు. దేశం కోసం తాను పోరాటం చేస్తున్నానని అన్నారు.

 


4583 ఈవీఎంలు పనిచేయలేదు..

ఏపీలో పోలింగ్ సందర్భంగా 4583 ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించాయని చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. అలాంటి ఫిర్యాదులేవీ తమకు అందలేదని కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ సమాధానం ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ గా తయారైందని, ఇంత బాధ్యతారాహిత్యమైన అధికారులను తాను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈవీఎంల పనితీరులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఇదివరకు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ వేస్తామని అన్నారు.


మిషన్లను కాదు..మనుషులను నమ్ముకున్నాం:

తాము మిషన్లను కాదని, మనుషులను నమ్ముకున్నామని కాంగ్రెస్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ అన్నారు. బీజేపీ మిషన్లను నమ్ముకుని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈవీఎంలను ఎలా బోల్తా కొట్టించవచ్చో తాము నిరూపిస్తామని చెప్పారు. ఒక పార్టీ గుర్తుపై బటన్ నొక్కితే, మరో పార్టీకి ఓటు పడుతోందంటూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ కేంద్రం గానీ, ఎన్నికల సంఘం గానీ పట్టించుకోలేదని అన్నారు. దీనిపై తాము దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని లేవదీస్తామని చెప్పారు. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామని విషయాన్ని తెలియజేయడానికి ఏడు సెకెన్ల పాటు గుర్తు కనిపిస్తుందని ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ.. అది మూడు సెకెన్లకు మించట్లేదని ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ విధానాన్ని మార్చేయాలని డిమాండ్ చేశారు.