బీజేపీ పై యుద్ధం ప్రకటించిన.. కేసీర్

     బీజేపీతో ఇకపై యుద్ధమేనని సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న 10 నెలలు చాలా కీలకమని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర కార్యవర్గ నేతలతో  సీఎం కేసీఆర్ అధ్యక్షతన  దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఫలితాలపై పోస్టు మార్టం, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఫాం హౌస్ ఇష్యూతో సంబంధమున్న నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఐటీ,ఈడీ,సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పారు. ఎక్కడ కేంద్రం దాడులు చేస్తే అక్కడే ధర్నాలు చేయండి అని చెప్పారు కేసీర్.

     పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందస్తు ముచ్చటేలేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతామని తేల్చి చెప్పినట్లు సమాచారం. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, నేతలంతా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని పక్క పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

     టీఆర్ఎస్ నేతలతో ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరు టచ్ లోకి వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. తన బిడ్డ కవితను కూడా పార్టీ మారమని అడిగారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తే ఆ విషయం తన దృష్టికి తేవాలని, ఒకవేళ చెప్పకపోయినా తనకు తెలిసిపోతుందని అన్నారు. టీఆర్ఎస్ నేతలు పార్టీ మారాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.  ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్నది తనకు తెలిసిపోతుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే మంత్రి కేటీఆర్కుగానీ ప్రగతి భవన్కు గానీ వచ్చి చెప్పుకోవాలని చెప్పినట్లు సమాచారం.