ఫోన్ ఎక్కువగా వాడొద్దు అన్నందుకు

  • భవనం పైనుంచి దూకి ఒకరు
  • ఉరేసుకొని మరొకరు
  • హైదరాబాద్ నగరంలో ప్రాణం తీసుకున్న బాలికలు

    సెల్ ఫోన్ చూడొద్దని తల్లులు మందలించారని మనస్తాపంతో హైదరాబాద్ నగరంలో ఇద్దరు బాలికలు బలవన్మరణం చెందారు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో ఒకరు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా మరొకరు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నారు.  అమీర్‌పేటలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోగల ఎవరెస్ట్‌ బ్లాక్‌లో నివసిస్తున్న మాధవికి ఇద్దరు పిల్లలున్నారు. ఆమె పెద్ద కుమారుడు బిట్స్‌ పిలానీలో చదువుతుండగా కుమార్తె సంహిత(13) స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తరచూ తన తాతకు చెందిన ఫోన్్ లో గేమ్స్‌ ఆడుతుండటం, మిత్రులతో సంభాషిస్తుండడంతో తల్లి వారించేది. పరీక్షల సమయంలో ఎక్కువ సేపు చరవాణి వాడొద్దని శుక్రవారం రాత్రి కూడా తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన బాలిక తాను ఇక బతకదలచుకోలేదని మిత్రులకు మెసేజ్ పెట్టి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆరో అంతస్తు పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు, క్లూస్‌ టీం నిపుణులు ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. బాలిక తాత మనోహర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

        సనత్‌నగర్‌ ఎస్‌.ఆర్‌.టి.కాలనీకి చెందిన ఆర్‌.వి.నవీన్‌ కుమార్తె స్నేహ(17) కుందన్‌బాగ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంట్లో ఉన్న సమయంలో ఎప్పుడూ సెల్ ఫోన్  వినియోగిస్తుండటంతో తల్లి మందలిస్తుండేది. శనివారం సాయంత్రమూ ఈవిషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది. మనస్తాపం చెందిన స్నేహ తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు