ఫలించిన విద్యార్థుల పోరాటం.. యూజీ విద్యార్థులకే హాస్టల్..

     నిజాం కాలేజీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. కొత్త హాస్టల్ ను పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదలచేశారు. హాస్టల్లో 100శాతం వసతి యూజి విద్యార్థులకే కేటాయిస్తామని స్పష్టం చేశారు. హాస్టల్ ఫెసిలిటీ కోసం యూజీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. 

  అంతకు ముందు నిజాం కాలేజ్ విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్ వసతి విషయంలో ఓయూ వీసీ, నిజాం ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కాలేజ్ ప్రిన్సిపాల్‭కు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. 

   హాస్టల్ కోసం చేస్తున్న పోరాటం ఫలించడంతో నిజాం విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 రోజులుగా వారు కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసనలు తెలిపారు. ఇంతకు ముందు హాస్టల్ లో 50 శాతం యూజీ, 50 శాతం పీజీ విద్యార్థులకు కేటాయించాలని నిర్ణయించారు. దీనిపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనను కొనసాగించారు. నిరసనలు ఉధృతం కావడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోసారి విద్యార్థులతో మాట్లాడి వారికి హామీ ఇచ్చారు. విద్యాశాఖ ఆదేశాలతో వందశాతం హాస్టల్ ను విద్యార్థులకు కేటాయించేందుకు నిజాం కళాశాల ప్రిన్సిపాల్ అంగీకరించారు