పండుగ వేళ ప్లాట్‌ఫాం టికెట్ రేటు డబుల్......

      సంక్రాంతి రద్దీ నియంత్రణ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను తాత్కాలికంగా  పెంచింది. ఈ నెల 8వ తేదీ నుంచి 20 వరకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో  తెలిపారు. కాచిగూడ నుంచి  రాకపోకలు సాగించే  ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

పండుగ సీజన్‌లో పెద్ద ఎత్తున జన సమూహం ప్లాట్‌ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు, రద్దీ వల్ల  ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు.