న‌గ‌ర వైభ‌వాన్ని మ‌రింత పెంచాలి.... సీఎం కేసీఆర్‌

   విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.

  ‘‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన  అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటెనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సీఎం కేసీఆర్ హితవు పలికారు.