నిర్మాణంలో ఉన్న ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపుతో ఎవరికి లాభం?

నిర్మాణంలో ఇళ్లపై 2019 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని చిన్నతరహా గృహాలకు 1%కి, ఇతర గృహాలకు 5%కి తగ్గిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దీంతో కొనుగోలుదారులకు ఏం ప్రయోజనం?

ఇప్పటివరకూ ఎలా ఉంది?

గత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అంటే మార్చి 31, 2019 వరకూ అన్ని రకాల ఇళ్లకు బిల్డర్లు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందేవారు. అలాగే నిర్మాణంలో ఉన్న చిన్నతరహా ఇళ్లకు 8%, ఇతర ఇళ్లకు 12% బిల్డర్ జీఎస్టీని చార్జ్ చేసేవారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బిల్డర్లు లేదా డెవలపర్లు అన్ని రకాల ఇళ్లపై అమ్మకపు ధరలో దాదాపు 8% ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందేవారు. అమ్మకపు ధరను నిర్ణయించేముందు బిల్డర్లు దీన్ని దృష్టిలో ఉంచుకునే ఓ తుది రేటును నిర్ణయించుకుంటారు. అంటే, అమ్మకం ధరను తగ్గించడం ద్వారా కొనుగోలుదారులకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ మొత్తాన్ని బిల్డర్లు బదలాయించేవారు. 

వాస్తవానికి కొనుగోలుదారుడు డిఫరెన్షియల్ జీఎస్టీని చెల్లించేవారు. అంటే, చెల్లించాల్సిన మొత్తం జీఎస్టీ నుంచి బిల్డర్‌ తనకు బదలాయించిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను తగ్గించగా వచ్చిన మొత్తం... దీన్ని చెల్లిస్తే సరిపోయేది.

ఏప్రిల్ 1, 2019 నుంచి జీఎస్టీ మండలి పన్నును చిన్నతరహా గృహాలపై 1%కి, ఇతర ఇళ్లపై 5%కి తగ్గించినప్పటికీ, నూతన ధరల విధానం ప్రకారం బిల్డర్లకు కొన్ని షరతులు విధించింది.

  • బిల్డర్‌కు ఇన్‌పుట్ టాక్స్ అనుమతించడం లేదు.
  • రివర్స్ చార్జ్ మెకానిజమ్ కింది బిల్డర్ పన్ను చెల్లించాలి.

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ బిల్డర్‌కు రావడంలేదు కాబట్టి, అతను చెల్లించిన జీఎస్టీ మొత్తం ఇంటిధరకు కలుస్తుంది. దీంతో ఇంటి ధర పెరుగుతుంది, అంటే కొనుగోలుదారుడిపై భారం పడుతుంది. అంటే, కొనుగోలుదారుడు ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. 80% నిర్మాణానికి అవసరమైన సేవలను (ఇన్‌పుట్ సర్వీసెస్) రిజిస్టర్డ్ వ్యక్తుల నుంచే పొందాలి. ఒకవేళ ఇవి 80% కన్నా తక్కువగా ఉంటే దానిపై 18% టాక్స్‌ను బిల్డర్ చెల్లించాలి. ఇంతకుముందున్న పన్ను విధానంలో 80% ఇన్‌పుట్ సేవలను రిజిస్టర్డ్ వ్యక్తుల నుంచే పొందాలనే నిబంధనేదీ లేదు.

 

బిల్డర్ల దగ్గర సాధారణంగా రెండు రకాల కొనుగోళ్లు జరుగుతుంటాయి. మొదటిది రిజిస్టర్డ్ వ్యక్తుల నుంచి సామగ్రి కొనుగోలు చేయడం, రెండోది, కూలీలు, ఇటుకలు, విద్యుత్ ఉపకరణాలను బిగించడం, నీటి సరఫరా, మొదలైనవి. ఈ రెండో రకం సేవలను అందించేవారు సాధారణంగా స్వతంత్ర వ్యక్తులే అయ్యి ఉంటారు. వీరికి జీఎస్టీకి నమోదుకావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వీరి సంవత్సర వ్యాపార విలువ జీఎస్టీ పరిధి కన్నా తక్కువే ఉంటుంది. అందువల్ల ఈ సేవలపై రివర్స్ చార్జ్ మెకానిజమ్ (ఆర్‌సీఎం) కింద బిల్డరే 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

బిల్డర్‌కు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆర్‌సీఎం కింద చెల్లించిన ఈ అదనపు పన్ను కూడా ఇంటి ధరకు కలుపుతారు. దీనివల్ల ఇంటి ధర మరింత పెరుగుతుంది. ఈ కారణాల వల్ల ధరల్లో వచ్చిన మార్పుల కారణంగా కొనుగోలుదారుడిపై అదనంగా భారం పడుతోంది. అందువల్ల పన్ను రేట్లు తగ్గినా, కొనుగోలుదారులు ఇంతకుముందున్న పన్నుల ప్రకారం చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఇళ్ల కొనుగోళ్లను అందరికీ అందుబాటులోకి తెస్తున్నామని చెబుతూ జీఎస్టీ మండలి కొనుగోలుదారులను తప్పుదారి పట్టిస్తోంది. జీఎస్టీ ధరలో వచ్చిన ఈ తగ్గింపు వాస్తవానికి వినియోగదారుడు (కొనుగోలుదారుడు)పై మరింత భారాన్ని మోపుతోంది.