ధరణి పోర్టల్, ఎల్ ఆర్ఎస్ రద్ద చేయ్యాలి..

 

ధరణి పోర్టల్, ఎల్ ఆర్ఎస్ రద్ద చేయ్యాలి..

ఆర్థికంగా నష్టపోతున్న రియల్టర్లు, కోనుగోలు దారులు..

 

                 దరణి పోర్టల్ కారణంగా మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేయడానికి రియల్టర్స్ అసోషియేషన్  వ్యతిరేకించింది. లక్షల రూపాయాలతో కొనుగోలు చేసిన భూములను ఎల్ఆర్ఎస్ లేదన్న పేరుతో రిజిస్ట్రేషన్లు నిలిపేయడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి అనుబంధంగా పని చేసే వివిధ విభాగాలకు చెందిన లక్షలాది మందికి ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వివిధ పార్టీలతో పాటు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మద్దతు ప్రకటించారు.

 

                     నెలల తరబడి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమంటున్నారు రియల్టర్లు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించకపోవడంతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రియల్టర్లకు మరియు డాక్యుమెంట్ రైటర్లకు పలు పార్టీలు, నాయకులు మద్దతు ప్రకటించారు. రాష్ట్రం ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయం కారణంగా తామంతా ఇబ్బందులు పడుతున్నామన్నారు తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య. రియలెస్టేట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేదని, రిజిస్ట్రేషన్లు నిలిపేయడంతో అది పూర్తిగా పడిపోయిందన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంతో రియల్ ఎస్టేట్ వ్యవస్థను సర్వ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలకు ఎలాంటి లాభం చేకూరిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఈ రంగంపై ఆధారపడ్డ వారంతా రోడ్డున పడ్డారన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

 

                 రియల్టర్ల ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతు ప్రకటించారు. రిజిస్ట్రేషన్లలు ఆపడం సరైన కాదన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రస్తుతం సచివాలయం కూల్చారని, కొత్త సచిివాలయం నిర్మాణం చేసే వరకూ ఉద్యోగులకు జీతాలు చెల్లించేది లేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. ధరణి పూర్తయ్యే వరకూ రిజిస్ట్రేషన్లు చేయమని చెప్పడం కూడా అలాంటిదేనని ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. వెంటనే డబ్బులు వస్తాయని ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ముడి పెట్టిందని, ఇది సబబు కాదన్నారు నాగేశ్వర్.ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు మౌలిక వసతులు కల్పించేందుకు ఖర్చు చేయడం లేదని ఎల్ఆర్ఎస్‌తో  పేరుతో ప్రజలపై భారాలు మోపడం అశాస్త్రీయమన్నారు. హైకోర్టు సూచనల మేరకు వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.  సర్కార్ ఎల్ఆర్ఎస్‌తో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేందుకు ప్లాన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆగమాగం చేసిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. చిన్న చిన్న ప్లాట్లు కొన్న మధ్య తరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం దోచుకోవాలని చూస్తే డబ్బులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నిషేధిత భూముల జాబితాలో భూములను చేర్చకుండా రిజిస్రేషన్లు ఆపడం సరికాదన్నారు. సీఎం ముందు మాట్లాడేందుకు ఏ మంత్రికి దమ్ము లేదని ప్రజలు గద్దెనెక్కిన సీఎం ప్రజలకు దూరంగా ఉంటే ఎలా అని ఆయన మండిపడ్డారు. రిజిస్ట్రేషన్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ లాంటివని, వాటిని ఎలా బంద్ చేస్తారన్నారు. ఎల్ఆర్ఎస్ కడితే తప్ప రిజిస్ట్రేషన్లు చేయమని చెప్పడం సరికాదన్నారు. టీఆర్ఎస్ నాయకులే పార్కులు, ప్రభుత్వ భూములు, నాలాలు కబ్జా చేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.  కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ చేసే వ్యవసాయం, రియల్ ఎస్టేట్, విద్య రంగం కుప్పకూలాయని అన్నారు.


                 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు వెంటనే ప్రారంభించాలని ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని ఎల్ఆర్ఎస్ ను తీసేయాలంటూ తెలంగాణ రియల్టర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.