జేసి రాజీనామాతో టీడీపీలో సంచలనం ..?

జేసి దివాకర్ రెడ్డి ... చంద్ర బాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. నేను చెప్పిన అభ్యర్థులను మార్చకపోతే ఎంపీగా నిలబడేది లేదని తేల్చి చెప్పేశాడు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ అక్కడ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. ఇక్కడ అసలైన కథ ఏమిటంటే.. ఒకవేళ జేసీ చెప్పిన వారికే టికెట్లను కేటాయిస్తే.. సిట్టింగులు ఊరికే ఉండరు! వారు కచ్చితంగా రెబల్స్ గా రంగంలోకి దిగుతారు. ఈ రోజు నామినేషన్ వేయబోతున్నట్టుగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పేపర్ యాడ్ కూడా ఇచ్చేశారు.
పార్టీ తరఫునే నామినేషన్ అని ఆయన ప్రకటించుకున్నారు. టీడీపీలోనే ఈ చౌదరిపై తీవ్రంగా వ్యతిరేకత ఉంది. జేసీ కూడా ఈయన అభ్యర్థిత్వాన్ని వద్దు అంటున్నారు.

అయితే హనుమంతరాయ చౌదరి మాత్రం నామినేషన్ వేస్తున్నారు ఈరోజు. ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. అనంతపురం అర్బన్ కథా ఇదే. ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వాన్ని జేసీ గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చౌదరికి ఇవ్వకపోతే టీడీపీ అవకాశాలు తగ్గిపోతాయి. అంతేకాదు.. చౌదరి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినా ఆశ్చర్యంలేదు. గుంతకల్ కథా ఇదే. శింగనమల వ్యవహారమూ ఇదే. సిట్టింగులకు ఇవ్వకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. ఇస్తే వారు ఓడిపోవడం ఖాయం, జేసీకి కూడా వాళ్లంటే అస్సలు పడటంలేదు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మధ్య మార్గంగా జేసీ మాట మేరకు ఇద్దరిని తప్పించడం, ఇద్దరిని అలాగే పెట్టడం అనే ఫార్ములా ఒకటి వినిపిస్తోంది. గుంతకల్, శింగనమల సీట్లలో జేసీ చెప్పిన వారిని అభ్యర్థులుగా పెట్టడం.. అలాచేస్తే గుంతకల్ లో జితేంద్రగౌడ్ రెబల్ కావడంఖాయం. శింగమనలలో జేసీ చెబుతున్న వారికి కనీస గుర్తింపులేదు. వారు గెలవలేరు! ఒకవేళ జేసీ దివాకర్ రెడ్డి.. ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు మాటకు తలొగ్గినా.. ఎంపీ ఓటు విషయంలో చౌదరి వర్గం దివాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించదు. ఎమ్మెల్యే ఓటు విషయంలో జేసీవర్గం చౌదరికి అనుకూలంగా వ్యవహరించదు. ఇలా ఎలా చూసినా.. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని అభ్యర్థిత్వాలతో ముడిపడిన అనంతపురం ఎంపీ సీటు రాజకీయం రసవత్తరంగా మారింది!