జీహెచ్‌ఎంసీలో గెలిచిన 150 మంది అభ్యర్ధల గెజిట్ విడుదల

    బాగ్యనగరానికి కొత్త పాలక మండలి.....

          గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ)కి కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లతో ఎట్టకేలకు గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి. రిజర్వేషన్లు, పార్టీలవారీగా కార్పొరేటర్ల వివరాలతో శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు వారాల తర్వాత అధికారికంగా ఎన్నికల్లో గెలుపొందిన వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్‌లో ప్రచురించింది. బల్దియాలో గతంలో ఎప్పుడూ పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు జరిగినందున ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 తేదీ వరకు ఉండటం, అప్పటివరకు కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశం లేకపోవడంతో ఇప్పటిదాకా గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించలేదు.

మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఇలా.....

      నిబంధనల మేరకు గెజిట్‌లో ప్రచురించాక నెలరోజుల్లోగా కొత్తపాలకమండలి సభ్యుల ప్రమాణం చేయనున్నారు. మొదటి సాదారణ సమావేశంలో కార్పోరేషన్ కు ఎన్నికైన సభ్యులు తమలో ఒకరిని మేయరగా మరోకరిని డిఫ్యూటీ మేయర్ గా ఎన్నుకోవల్సి ఉంటుంది. దీంతో వచ్చే నెల 15 లోగా ఈ కార్యక్రమాలు పూర్తికానున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతోపాటు వారి ఎన్నికకు ఎన్నికల అధికారిగా గ్రేటర్‌ పరిధిలోని జిల్లాలకు చెందిన కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌ను నియమిస్తారని సంబంధిత అధికారి తెలిపారు.