జనసేన ఎన్నికల మేనిఫెస్టో

  • రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల వారీగా ప్రత్యేక హామీలు

జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా ఎకరాకు ఎనిమిది వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు, 60 ఏళ్లకు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు, కౌలు దారులకు నెలకు రూ.5,000 పింఛను ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ సరుకులకు బదులుగా కుటంబంలోని మహిళల బ్యాంకు ఖాతాలో నేరుగా ప్రతి నెలా నగదు జమచేస్తామని తెలిపింది. కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో కుటుంబానికి రూ.2,500 నుంచి 3,500 నగదు బదిలీ చేస్తామని పేర్కొంది.

మొత్తం 96 హామీలను జనసేన తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. వాటిలో కొన్నింటిని చూద్దాం.

ప్రాంతాల వారీగా ప్రత్యేక హామీలు

1.ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక పథకం: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అరకు లోయ ప్రాంతాల అభివృద్ధి కోసం నూతన వ్యవసాయ పద్ధతులను తీసుకురావడం. వివిధ అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సహకారంతో నదుల అనుసంధానం, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం, పాత ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఫిషింగ్ హార్బర్, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడం.

2.సౌభాగ్య రాయలసీమ: రాయలసీమ ప్రాంతానికి పదేళ్ల పాటు కరవు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు . కరవు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రాయితీలు కల్పించడం. సాగు, తాగు నీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీటిని తరలించడం. రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలకు సంబంధించి కోర్టుల్లో, ట్రైబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం.

3.కోనసీమ అభివృద్ధి: అంతర్జాతీయ స్థాయి నీటిపారుదల సదుపాయాలు, రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, కొబ్బరి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం మీదుగా కాకినాడ నుంచి తెనాలి వరకు కోస్తా రైల్వే లైను ఏర్పటు. రాజమహేంద్రవరం విమానాశ్రాయాన్ని అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా అభివృద్ధి చేయడం.
 

రైతుల కోసం

  • రైతులకు ఉపాధి కోసం 'ఆపర్చునిటీ జోన్ల' ఏర్పాటు
  • గోదావరి బేసిన్‌లో రూ.5000 కోట్లతో అంతర్జాతీయ ధాన్య, పండ్ల మార్కెట్
  • తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు
  • మూడేళ్లపాటు రైతులకు ఎరువులు, వ్యవసాయ యంత్రాలు ఉచితంగా పంపిణీ
  • ఉపాధి హామీ పథకం కిందకు వ్యవసాయ పనులు
  • రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపుల పంపిణీ

విద్యార్థుల కోసం

  • ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • విద్యార్థులందరికీ ఉచిత బస్సు, రైలు పాసులు. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు కాలేజీల్లో 'డొక్కా సీతమ్మ క్యాంటీన్ల' ఏర్పాటు
  • ఇంటర్మీడియెట్ విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు
  • డిగ్రీ స్థాయిలోనే విద్యార్థుల్లో సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు
  • అంగన్‌వాడీ కేంద్రాలను నర్సరీలుగా మార్పు
  • కులాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకే హాస్టల్‌లో ఉండేలా ఏర్పాటు
  • రాష్ట్రంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకూ ఏడాది మొత్తానికి ఒకేసారి ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించడం
  • ప్రతి విద్యార్థికి కళాశాల స్థాయిలోనే తప్పనిసరిగా నైపుణ్య అభివృద్ధి, వృత్తి సంబంధమైన శిక్షణ ఇవ్వడం
  • విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తక్కువ వడ్డీకే రుణాలు

వైద్యం

  • ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమా. చేతి వృత్తుల వారికి రూ. 2 లక్షల అదనపు బీమా
  • జిల్లా ఆస్పత్రులన్నింటినీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా అభివృద్ధి
  • మండలానికో సంచార వైద్యశాల, సంచార మందుల వాహనం
  • వైద్య కేంద్రాలన్నింటినీ 30 పడకల ఆస్పత్రిగా మార్చి 24 గంటల సేవలు కల్పించడం
  • గిరుజనులకు అత్యవసరం అందించేందుకు అయిదు గ్రామాలకో అంబులెన్సు
  • ప్రతి మండలంలో ప్రభుత్వ వృద్ధాశ్రమాలు ఏర్పాట

​ఉపాధి, ఉద్యోగాలు

  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి కేలండర్ ఏర్పాటు
  • ఆరు నెలల్లోగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
  • యువతను పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు
  • రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు 25,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
  • ఎస్టీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు వారు ప్రారంభించే పరిశ్రమలకు, స్టార్టప్ సంస్థలకు రూ.2,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు

మహిళలు

  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
  • గృహిణులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
  • ఆడపిల్లల పెళ్లి కోసం లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు
  • ప్రతి మండలంలోనూ మహిళా భద్రత, సాధికారత కోసం కేంద్రాలు ఏర్పాటు
  • ప్రతి మండల కేంద్రంలోనూ మహిళల కోసం సమాచార, సలహా కేంద్రాలు ఏర్పాటు
  • 'ఆడపడుచుకు కానుక' పేరిట ప్రతి మహిళకూ ఏటా రూ.10,001 చొప్పున పండుగల కానుక
  • మహిళల అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యేక వైద్యశాలల ఏర్పాటు