గబ్బా టెస్టులో భారత్ ఘన విజయం

       ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత‌మైన విజ‌యం....

       ఆస్ట్రేలియాపై టీమిండియా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యం సాధించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టింది.  3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మ‌న్ గిల్ (91), రిష‌బ్ పంత్(89 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్‌తోపాటు ఆస్ట్రేలియా పేస‌ర్ల బౌన్స‌ర్ల‌కు శ‌రీర‌మంతా గాయ‌ప‌డినా పోరాడిన పుజారా (56) టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌డం విశేషం. చివ‌రి వ‌ర‌కూ న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌.. టెస్ట్ క్రికెట్‌లోని అస‌లైన మ‌జాను రుచి చూపించింది. 

చరిత్రలో రిషబ్ పంత్.....  

      రిష‌బ్ పంత్ మ‌రో కీల‌క ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.  బ్రిస్బేన్ టెస్టులో టీమిండియాకు అత్య‌ద్భుత‌ విజ‌యాన్ని అందించాడు.  అజేయ‌మైన హాఫ్ సెంచ‌రీతో ఆసీస్‌కు స్వంత దేశంలోనే చుక్క‌లు చూపించాడు. 137 బంతుల్లో  9 బౌండ‌రీలు, ఓ సిక్స‌ర్‌తో రిష‌బ్ అజేయంగా 89 ర‌న్స్ చేశాడు.   గ‌బ్బా మైదానంలో అయిదో రోజు అసాధార‌ణ ఆట‌తీరుతో ఆసీస్ బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొన్నాడు.  ఓ ద‌శ‌లో మ్యాచ్ డ్రా దిశ‌గా వెళ్తుంద‌నుకున్న స‌మ‌యంలో.. పంత్ త‌న ప‌వ‌ర్ గేమ్‌తో థ్రిల్ పుట్టించాడు.  స‌హ‌జ శైలిలోనూ భారీ షాట్లు కొడుతూ.. ఆస్ట్రేలియా ఆటగాళ్ల‌లో టెన్ష‌న్ పుట్టించాడు.  ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు పంత్ తన ఆట‌తీరులో ప్ర‌ద‌ర్శించిన ప‌రిణ‌తి అమోఘం.  టెస్టుల్లో నాలుగ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసిన రిష‌బ్‌.. అనూహ్య రీతిలో టీమిండియాకు విజ‌యాన్ని అందించిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర‌లో నిలిపోయాడు. ట్వెంటీట్వెంటీలా ట్విస్టులు తిరిగిన మ్యాచ్‌లో.. రిష‌బ్ సూప‌ర్ హీరోలా అవ‌త‌రించాడు.

అభినందనల వెల్లువ...

   ఆస్ట్రేలియాపై టీమిండియా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యం సాధించడంపై ప్రదానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మోదీ ట్విటర్ వేదికగా ప్రశంషలు కురిపించారు టీం ఇండియాపై.  

  టీం ఇండియాపై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రశంషలు కురిపించారు.