గడువులోగా పూర్తి చేయండి- సీఎం కేసీఆర్‌

వేగం పెంచండి ..నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దు..    

     నూతన సచివాలయ పనులు ఎట్టి పరిస్థితిలోనూ నిర్ణయించిన గడువులోగా పూర్తికావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కొత్త స‌చివాల‌య నిర్మానాన్ని అత్యాధునికంగా.. సకల సౌకర్యాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ప‌నుల‌ను షాపూర్‌ పల్లోంజీ చేపడుతోంది. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ పనులను మంగళవారం సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లతో సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను అక్క‌డున్న సిబ్బందిని అడిగి కొన్ని సూచనలు చేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.  ఏ కారణం చేతనో నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని.. గడువు పెంచాలని వర్క్‌ ఏజెన్సీలు కోరితే అంగీకరించేది లేదు. టెండర్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయించిన గడువులోగా నూతన సచివాలయ భవన సముదాయం నిర్మించి అప్పగించాల్సిందే. ఏ రోజుకారోజు పనుల పురోగతిని అధికారులు పరిశీలిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వాలి.