కాఫీ కనుమరుగైపోతుందా... చాక్లెట్ కూడా ఇక దొరకదా?

ఆలివ్ నూనె నిల్వలు తరిగిపోతున్నాయని ఇటలీ రైతులు చెబుతున్నారు. ఆలివ్ పంట ఉత్పత్తి తగ్గిపోవడానికి వాతావరణ మార్పులే కారణమని వారంటున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో యూరప్‌లో అత్యంత వేడి లేదా చల్లని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు మానవ తప్పిదాలే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోకో దిగుబడులు తగ్గడంతో చాక్లెట్ ప్రమాదంలో పడింది. అధిక ఉష్ణోగ్రతలు కోకో పంటకు చేటు చేస్తున్నాయి. ఈ గింజలు పెరగడానికి అనువైన పరిస్థితులుండటం లేదు.

కాఫీ అంతరించిపోతుందా?
ఉదయం లేవగానే కాఫీ లేకపోతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా కరవుల తీవ్రత పెరుగుతోంది. వచ్చే శతాబ్దంలో మంచి కాఫీ దొరకడమూ కష్టమే కావచ్చు. ఒకవేళ దొరికినా కొనడం అంతకన్నా కష్టంగా మారొచ్చు. ఎందుకంటే ధరలు ఏమాత్రం అందుబాటులో ఉండవు. 2050 నాటికి మధ్య, దక్షిణ అమెరికాల్లోని కాఫీ పండించే ప్రాంతాల్లోని 80శాతం ప్రదేశాలు కాఫీ పంటకు పనికిరాకుండాపోతాయి.
కోకో పంట
మహాసముద్రాలు వేడెక్కడం వల్ల కొన్ని మత్స్యజాతులు అంతరించిపోతున్నాయి. దీంతో లక్షల మందిపై ప్రభావం పడుతోంది. వారి ఆహార, ఉపాధి అవకాశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఆహారంలో మనం తీసుకునే జంతు ప్రొటీన్లలో 17శాతం చేపల నుంచే వస్తాయి. కానీ కొన్ని జాతుల మనుగడ ప్రమాదంలో ఉండటం దీనిపై కూడా ప్రభావాన్ని చూపుతోంది.

మీకు మద్యం ఇష్టమైతే, వాతావరణ మార్పులపై కూడా ఓ కన్నేయండి. భూతాపం కారణంగా ఫ్రాన్స్, చిలీ, ఆస్ట్రేలియాల్లోని సంప్రదాయ వైన్ ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో... వేగంగా మారుతున్న పరిస్థితులు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇంగ్లండ్ లాంటి చల్లని ప్రదేశాలు దానికి అనువుగా మారుతున్నాయి.