కట్టలు తెంచుకున్న కరెన్సీ.... ఏరులై పారుతున్న లిక్కర్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం అత్యంత రసవత్తరంగా మారింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను తమవైపు తిప్పపుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

ఎన్నికలప్పుడు ఒకవైపున జోరుగా ప్రచారాలు చేస్తూనే, మరోవైపు డబ్బు, మద్యంతో ప్రజలను ప్రలోభపెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తుంటారు. ప్రధానంగా తటస్థంగా ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రలోభాలకు గురిచేస్తుంటారు.

ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ప్రవాహం అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఎన్నికల సంఘం వెల్లడిస్తున్న వివరాల్లో ఆ విషయం అర్థమవుతోంది.

కొన్ని రోజులుగా రాష్ట్రంలో లక్షల లీటర్ల మద్యం, డబ్బుల కట్టలు పోలీసులకు పట్టుబడుతున్నాయి.

తనిఖీలలో శుక్రవారం నాటికి రూ.97.26 కోట్ల మేర నగదు, 92 కిలోల బంగారం, 267 కిలోల వెండి పట్టుబడిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

బుధవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 6.17 లక్షల లీటర్ల మద్యం పట్టుబడిందని, దాని విలువ రూ.23 కోట్ల ఉంటుందని తెలిపారు.

2014 ఎన్నికల సమయంలో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 1.44 కోట్ల లీటర్ల మద్యం, రూ.124 కోట్ల నగదు పట్టుబడింది.

 

సున్నితమైన నియోజకవర్గాలు

ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్నాటక, గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో డబ్బు, మద్యం ప్రవాహం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల ఖర్చులపరంగా 150కి పైగా పార్లమెంట్ నియోజకవర్గాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 పార్లమెంటు స్థానాలకుగాను, 16 స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలూ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే, ఏపీలోని 116 అసెంబ్లీ నియోజకవర్గాలను డబ్బు ప్రవాహం అత్యధికంగా ఉండే ప్రాంతాలుగా ఈసీ పసిగట్టింది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల వ్యయాలను అంచనా వేసేందుకు ప్రత్యేక పరిశీలకులను పంపింది. 2014 ఎన్నికల్లో నగదు పట్టివేత, ఓటర్లకు డబ్బు పంపిణీకి సంబంధించిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల అధికారులు ఈ జాబితాను రూపొందించారు. ఎన్నికల సంఘంతో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా అభ్యర్థుల ఖర్చులపై కన్నేసి ఉంచుతున్నారు. అందుకోసం ఆ శాఖ కూడా ప్రత్యేక పర్యవేక్షకులను రంగంలోకి దించింది.

అత్యంత ఖరీదైన ఎన్నికలు

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ఖర్చు దేశవ్యాప్తంగా దాదాపు రూ.50,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు అవుతుందని దిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అంచనా వేసింది. ఇది 2014 ఎన్నికల ఖర్చుతో పోల్చితే 40 శాతం అధికమని ఆ సంస్థ తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో అయిన ఖర్చు రూ.7,000 కోట్ల నుంచి రూ.8,000 వరకు ఉంటుందని అధికారిక అంచనా. కానీ, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ లెక్కల్లో చూపని అనధికార వ్యయం మరో రూ. 27,000 కోట్లు ఉంటుందని, అంతా కలిపితే రూ. 35,000 కోట్లు అవుతుందని సీఎంఎస్ వివరించింది.

వ్యయ పరిమితి

లోక్‌సభ అభ్యర్థులు రూ.54 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో వ్యయ పరిమితి రూ. 54 లక్షలు కాగా మిగతా రాష్ట్రాల్లో రూ.70 లక్షలుగా ఉంది. దిల్లీలో రూ.70 లక్షలు కాగా, మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలోనూ రూ.54 లక్షలుగా ఉంది. శాసనసభ అభ్యర్థుల వ్యయ పరిమితి పెద్ద రాష్ట్రాల్లో రూ. 28 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ. 20 లక్షలుగా ఉంది. అయితే, ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు పరిమితికి మించి ఎన్నో రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి అనధికార వ్యయంలో మద్యం, నగదు పంపిణీదే సింహ భాగంగా ఉంటుందని అంచనా.

చట్టం ఏం చెబుతోంది...

ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చట్టబద్దమైన పరిమితికి లోబడి చేసే వ్యయం. ఇందులో అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రకటనలకు పెట్టే ఖర్చులు ఉంటాయి. రెండోది పరిమితికి మించి చేసే ఖర్చు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, లేదా ఇతర వస్తువుల పంపిణీతో పాటు 'చెల్లింపు వార్తల' కోసం చేసే వ్యయం ఇందులోకి వస్తుంది. ఇలాంటి వ్యయాన్ని భారతీయ శిక్షా స్మృతితో పాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద 'లంచం ఇవ్వడం'గా పరిగణిస్తారు. అలా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి cVIGIL అనే మొబైల్ యాప్‌ ద్వారా రహస్యంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై 100 నిమిషాల్లోనే అధికారులు దర్యాప్తు పూర్తి చేస్తారు.

నకిలీ భయం

2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పెద్దఎత్తున నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచే కాకుండా గోవా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన నకిలీ మద్యం కూడా పెద్దఎత్తున పట్టుబడింది. దాంతో, ఈసారి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. చాలా చోట్ల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ డబ్బు, మద్యంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు 31 సరిహద్దు చెక్‌ పోస్టులు, 46 తాత్కాలిక చెక్‌ పోస్టులు, 18 సంచార తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈసారి ఎన్నికల సంఘం నిఘాను పెంచే అవకాశం ఉందన్న ఆలోచనతో కొందరు నేతలు ఎన్నికల కోడ్ అమలులోకి రాకుముందే భారీగా మద్యం కొని నిల్వ చేసుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.