ఇర‌గ‌దీస్తున్న ఎండ‌లు..

ఇర‌గ‌దీస్తున్న ఎండ‌లు..
ప్ర‌తాపం చూపుతున్న  సూరీడు..
 

             సూరీడు సెగలు కక్కుతున్నాడు. వడగాడ్పులతో బెంబేలెత్తుతున్నాడు. ఎండల తీవ్రతతో భయపెడుతున్నాడు. రాష్ట్రంలో  గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదయ్యాయి.   భానుడి భగభగలకు ఉదయం 10 గంటలు దాటాక జనం ఇండ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతుండటంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. హైదరాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ వరకూ ఇదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వడదెబ్బతో 16 మంది మృతిచెందారు. వడగాడ్పుల వల్ల భూమి వేడెక్కి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం   వెల్లడించింది.  చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయని, దీంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాత‌వ‌ర‌ణ కేంద్ర అధికారులు చెబుతున్నారు.  

వడదెబ్బకు 16మంది మృతి

          వడగాడ్పుల తీవ్రతకు రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఆదివారం వడదెబ్బతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లాలో నలుగురు, ఖమ్మంలో ముగ్గురు, నల్లగొండ, మంచిర్యాల జిల్లాల్లో ఇద్దరు చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, నిర్మల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 

             గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఈ నెలలో రెండుసార్లు పగటి ఉష్ణోగ్రతలు 44డిగ్రీలు దాటి నమోద‌వుతున్నాయి.    ఈ నెల 15న 43.2 డిగ్రీలు నమోదుకాగా, 26వ తేది ఆదివారం 43.4 డిగ్రీలు.. 27వ తేది సోమ‌వారం 44.1డిగ్రీల‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  కనిష్ఠ ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా ఉంది.   మరో మూడ్రోజుల వరకు నగరంలో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని వాత‌వ‌ర‌ణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.