బల్దియాలో25మంది నేరచరితులు

  బల్దియాలో నేరచరితులు..

   విజయం సాధించిన 25మంది..

                 చదివిన డిగ్రీలు...,  అర్హతలను బట్టి ఉద్యోగాలు వస్తాయి.., ప్ర‌జ‌ల‌కు  చేసిన సేవల వల్ల   మంచి పేరు వస్తుంది. ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు తారుమార‌య్యాయి. ఎన్ని నేరాలు చేస్తే అంత గొప్ప నాయకుడు.  ఎన్ని కేసులు పోలీస్టేషన్‌లో నమోదైతే అంత గొప్ప పదవులను పొందవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. వీధి రౌడీ నుండి మొదలైన రాజకీయ నాయకుల చరిత్ర  ఇప్పుడు  కార్పోరేటర్ స్థాయి వరకు వచ్చింది.   బల్దియా ఎన్నికల బరిలో పోటికి దిగిన నేర‌చ‌రితులు ఎన్నికై పాలకమండలిలో అడుగుపెట్టబోతున్నారు.
 

              చట్ట సభల్లో అడుగు పెట్టాలంటే మొట్ట మొదటి అర్హత నేరాల సంఖ్య ఎంత ఉంటే అంత తొందరగా ప్రజా ప్రతినిదులుగా ఎన్నిక కావచ్చని మన నేతలు ఋజువు చేస్తున్నారు.  సేవా గుణమున్న నేతల కంటే నేర చరిత్ర ఉన్న నాయకులే చట్ట సభల్లోకి అడుగుపెట్టి ప్రజలను శాసించడమే కాకుండా శాసనాలను రూపొందిస్తున్నారు.  వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించినట్టే ఎన్నికల సమయంలో డబ్బులు కుమ్మరించి పార్టీ చిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు ఈ నేతలు.  అంతే కాదు ఎన్నికల ప్రచారంలో విచ్చల విడిగా డబ్బులను, మద్యాన్ని పంపిణీ చేసి విజయం సాదించి చట్ట సభల్లో అడుగు పెడుతున్నారు. తామేమీ తక్కువ కాదన్నట్టు రాజకీయ పార్టీలు సైతం సేవా గుణమున్న నాయకుల కంటే గెలుపు గుర్రాలను చూసుకొనే టిక్కెట్లను కేటాయిస్తున్నారానే ఆరోపణటు ఉన్నాయి.

 

                 ఇటివల జరిగిన  బ‌ల్దియా ఎన్నిక‌ల్లో మొత్తం 49మంది నేర చ‌రితుల‌కు టికిట్లు ఇచ్చాయి రాజకీయ  పార్టీలు . అందులో  టిఆర్ఎస్..,  మజ్లీస్.. కాంగ్రేస్.. బీజేపి...ఉన్నాయి.  అయితే ఇందులో 25 మంది  అభ్యర్థులు విజయం సాధించి పాలకమండలిలో అడుగు పెట్టబోతున్నారు. వారిలో అత్యదిక మంది బిజేపి నుండి నేరచరితులు ఎన్నికయ్యారు. మొత్తం 10మంది  బిజేపి అభ్యర్థులు కార్పోరేటర్లుగా ఎన్నిక అయ్యారు. ఇక రెండవ స్థానంలో 8 మందితో  టిఆర్ఎస్ తో ఉంంది.  ఎంఐఎం కు చెందిన 7మంది ఇప్పుడు కార్పోరేటర్లుగా విజయం సాదించారు.  ఇలా మొత్తం 25మంది వివిధ కేసుల్లో నేరచరితులుగా ఉన్న కార్పోరేటర్లు పాలకమండలిలో ఉండనున్నారు. ఇందులో ఇద్దరూ మహిళలు కూడా ఉన్నారు.  నేర చరిత్ర ఉన్న వారిని చట్ట సభల్లోకి ప్రవేశించకుండా ఎన్ని చట్టాలు తయారు చేసినా వాటిని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. గెలుపే లక్ష్యంగా అర్థ బలం, అంగ బలం ఉన్న నాయకులకే టిక్కెట్లను కేటాయిస్తున్నాయి పోలిటికల్ పార్టీలు.  గత పాలక మండలిలో సైతం 30మంది సభ్యులు క్రిమినల్ రికార్డులు ఉన్నావారున్నారు. అయితే ఇందులో ప్రజా సంక్షేమం కోసం చేసిన పోరాటాల్లో అయిన కేసులు పెద్దగా ఉన్నట్లు లేదు.